టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని తాను కోహ్లీని పర్సనల్ రిక్వెస్ట్ చేశానని గంగూలీ (Sourav Ganguly) చెప్పాడు. వన్డే కెప్టెన్సీని మార్చేముందు కూడా విరాట్‌తో మాట్లాడానని చెప్పాడు. కానీ, టీ20 కెప్టెన్సీ పునరాలోచన చేయాలని తనను ఎవ్వరూ కోరలేదని, వన్డే కెప్టెన్సీ తొలగించే విషయంలో ముందస్తు సమాచారం ఇవ్వలేదని కోహ్లీ (Virat Kohli) స్పష్టం చేశాడు.
మరోవైపు సౌతాఫ్రికాతో వన్డేలకు కోహ్లీ రెస్ట్ అడిగాడని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధూమల్ సహా కొందరు బోర్డు పెద్దలు మీడియాకు చెప్పారు. కానీ, తాను బ్రేక్ కోరలేదని విరాట్ కుండబద్దలు కొట్టాడు. దీంతో, గంగూలీ సహా బీసీసీఐ పెద్దలంతా ఇరకాటంలో పడ్డారు. మొత్తంగా కెప్టెన్సీ మార్పు ఇంత రచ్చగా మారడానికి కారణం ఇరు వర్గాల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడమే.
దీంతో విరాట్ కోహ్లిని తొలగిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై క్రికెట్ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. ఈ నేపథ్యంలో భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా బాంబు పేల్చాడు. కోహ్లీలాగే తనకు కూడా అన్యాయం జరిగిందని అర్ధం వచ్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తున్న కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఆయన ఫైరయ్యాడు.
అయితే, అమిత్ మిశ్రా 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి సత్తా చాటినా అతన్ని జట్టులో నుంచి తొలగించారు. ఆ తర్వాత 2017లో తిరిగి జట్టులోకి వచ్చిన అతను.. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 3 వికెట్లతో రాణించినప్పటికీ.. అకారణంగా అతన్ని పక్కకు పెట్టేశారు. 39 ఏళ్ల అమిత్ మిశ్రా భారత జట్టు తరఫున 22 టెస్ట్‌ల్లో 76 వికెట్లు, 36 వన్డేల్లో 64 వికెట్లు, 8 టీ20ల్లో 14 వికెట్లు పడగొట్టాడు.