[caption id="attachment_1235138" align="alignnone" width="1600"] భారత్ తన 2021 2022 టెస్టు సీజన్ ను వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ (WTC) ఫైనల్ తో ఆరంభించింది. 2021 జూన్ 18 నుంచి 23 మధ్య ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ మైదానంలో జరిగిన ఈ ఫైనల్లో భారత్ పేలవ ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. దాంతో టీమిండియా 2021-2022 టెస్టు సీజన్ ప్రయాణం ఓటమితో ఆరంభమైంది.
అనంతరం ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్ తో ఆరంభమైన టెస్టు సిరీస్ లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా అదరగొట్టింది. నాటింగ్ హామ్ మ్యాచ్ ను డ్రాగా ముగించిన టీమిండియా... క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను మట్టికరిపించింది. మూడో టెస్టులో ఓటమి ఎదురైనా... నాలుగో టెస్టులో విజయం సాధించి ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఐదో టెస్టుకు ముందర భారత టీంలో కరోనా కేసులు రావడంతో ఆ మ్యాచ్ నుంచి టీమిండియా తప్పుకుంది. దాంతో ఐదో టెస్టును ఈ ఏడాదికి వాయిదా వేశారు.
టి20 ప్రపంచకప్ లో ఘోరంగా గ్రూప్ దశ నుంచే ఇంటి దారి పట్టిన టీమిండియా... అనంతరం స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఆకట్టుకుంది. తొలి టెస్టు డ్రాగా ముగిసినా... వాంఖడే వేదికగా జరిగిన రెండో టెస్టులో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌలర్ ఎజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసి చరిత్ర లిఖించాడు. ఈ సిరీస్ 1-0తో ను గెలిచిన టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
[caption id="attachment_1144738" align="alignnone" width="1600"] ఇక సౌతాఫ్రికా గడ్డపై జరిగిన మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భారత్ చతికిల పడింది. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికాపై 113 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే అన్యూహ్యంగా మిగిలిన రెండు టెస్టుల్లోనూ ఓడి సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలిచే సువర్ణావకాశాన్ని కోల్పోయింది. ఈ సిరీస్ అనంతరం కోహ్లీ తన టెస్టు కెప్టెన్సీకి కూడా వీడ్కోలు పలికాడు.
టీమిండియా టెస్టు జట్టుకు కూడా రోహిత్ శర్మనే నాయకుడిగా బీసీసీఐ నియమించింది. తన తొలి టెస్టు సిరీస్ నే రోహిత్ చిరస్మరణీయం చేసుకున్నాడు. వన్డే, టి20ల్లో వరుస విజయాలతో అదరగొట్టిన రోహిత్... శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లోనూ అదే జోరు కనబరిచాడు. మొహాలి వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 222 పరుగులతో టీమిండియా గెలవగా... బెంగళూరు వేదికగా జరిగిన డే అండ్ నైట్ టెస్టులో 238 పరుగుల తేడాతో గెలిచి రెండు మ్యాచ్ ల సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. దాంతో రోహిత్ టెస్టుల్లో తొలి సిరీస్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.