ఈ ఏడాది టీమిండియా (Team India)కు ఎంతో కీలకం. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ (T20 WorldCup 2022)లో సత్తా చాటాలని టీమిండియా ఉవ్విల్లూరుతోంది. ఇందు కోసం టీమిండియా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) జట్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్‌కు సెలక్షన్ కమిటీ ఆటగాళ్లను ఎంపిక చేసింది.
ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) లో దుమ్మురేపిన ఆటగాళ్లను ఈ సిరీస్ కోసం భారత జట్టులోకి తీసుకున్నారు. ఈ సిరీస్ ద్వారా వారందర్నీ పరీక్షించే అవకాశం దక్కింది. ఈ సిరీస్ లో సత్తా చాటిన ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.
స్టార్ స్పోర్ట్స్‌తో రవిశాస్త్రి మాట్లాడుతూ.. 'దినేష్ కార్తీక్‌కు ఇది మంచి అవకాశం. అతను జట్టుకు కీ ఫ్యాక్టర్ కావచ్చు. అతను అనుభవజ్ఞుడు. అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మరి టీమిండియా ఏం కోరుకుంటుందో చూడాలి. ప్రస్తుతం జట్టుకు టాప్ ఆర్డర్లో లేదా ఫినిషర్‌గా ఆడగల వికెట్ కీపర్ అవసరం. మహేంద్ర సింగ్ ధోనీ పాత్రను పోషించగల వికెట్ కీపర్ కావాలి.
టీమిండియాలో కార్తీక్ తో పాటు రిషబ్ పంత్ ఉన్నాడు. అతడు టాప్ 4లో సత్తా చాటగలడు. భారత జట్టులో ఎక్కువ మంది ఫినిషర్లు లేరు. మహేంద్ర సింగ్ ధోనీ రిటైరయ్యాడు. కాబట్టి ఇప్పుడు దినేష్ కార్తీక్ రూపంలో టీమిండియాకు మంచి అవకాశం దక్కింది. అయితే, అతని జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్నది చూడాలి' అని చెప్పుకొచ్చాడు.