విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న తర్వాత.. బీసీసీఐ (BCCI) అతడిని వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కోహ్లీ.. తనకు తానే స్వయంగా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్, టీమిండియా మాజీ క్రికెటర్లు కోహ్లీకి ప్రత్యేక విషెస్ చెబుతున్నారు.
"టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగాలన్న విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. టీ20 కెప్టెన్సీ వదులుకున్నప్పటి నుంచి కోహ్లీ గడ్డు కాలాన్ని గడుపుతున్నాడు. తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. కాబట్టి బ్యాటర్‌గా స్వేచ్ఛగా ఆడడానికి విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీని వదులుకున్నాడు. విరాట్ కోహ్లీ పరిణతి చెందిన ఆటగాడు. కెప్టెన్సీ వదులుకునే నిర్ణయం తీసుకునే ముందు కోహ్లీ బాగా ఆలోచించి ఉంటాడని నేను కచ్చితంగా అనుకుంటున్నాను." అని కపిల్ దేవ్ పేర్కొన్నారు.
క్రిష్ణమాచారి శ్రీకాంత్, మహ్మద్ అజారుద్దీన్ వంటి తన జూనియర్ల కెప్టెన్సీలో తాను ఆడినట్లు కపిల్ దేవ్ గుర్తు చేసుకున్నారు. తనకు ఎటువంటి ఇగో లేదని చెప్పారు. సునీల్ గవాస్కర్ కూడా తన కెప్టెన్సీలో ఆడినట్లు కపిల్ దేవ్ తెలిపారు. విరాట్ కోహ్లీ కూడా తన ఇగోను పక్కన పెట్టి జూనియర్ల కెప్టెన్సీలో ఆడాలని సూచించారు.