ప్రపంచ క్రికెట్లో ఇండియా (India) స్థాయిని తగ్గించేలా బీసీసీఐ (BCCI) చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ (Chetan Sharma) మాట్లాడారు. చేతన్ శర్మపై జీ న్యూస్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ పెద్ద దుమారమే రేపింది. ఆయన ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్‌పై ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడిన మాటలను రహస్యంగా రికార్డు చేసిన ఆడియో బయటకు రావడంతో అవాక్కయ్యే విషయాలు తెలిశాయి. చేతన్ శర్మ చేసిన ఆరోపణలు ఆయన మాటల్లోనే..
* ఫిట్నెస్ కోసం ఇంజెక్షన్లు : ఇండియన్ ప్లేయర్స్ ఆడటానికి సరిపడా ఫిట్నెస్ లేకపోయినా, తమను తాము 100 శాతం ఫిట్‌గా చూపించుకునేందుకు నిషేధించిన కొన్ని రకాల ఇంజెక్షన్లు చేసుకుంటారు. డోప్ టెస్ట్‌లో పట్టుబడని కొన్ని రకాల ఇంజెక్షన్లు ఉన్నాయి. ఈ విషయంలో ఆటగాళ్ల డాక్టర్ల ప్రమేయం కూడా ఉంది. కానీ ఈ వ్యవహారాలు టీమ్ మేనేజ్మెంట్కు తెలియవు.
* బుమ్రా గాయాన్ని దాచాడు : 2022 T20 ప్రపంచ కప్‌కు కొన్ని రోజుల ముందు, 2022 సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా తన గాయాన్ని దాచిపెట్టాడు. ఫిట్‌గా ఉన్న ఆటగాడిగా సిరీస్‌లో ఆడాడు. 2వ మ్యాచ్‌కి ముందు బుమ్రా నొప్పి తీవ్రమైంది. టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కోసమే బుమ్రా ఈ పని చేశాడు. ఆ తర్వాత బుమ్రా 3వ మ్యాచ్‌లో ఆడవలసి వచ్చింది. దీంతో గాయం తీవ్రమైంది ఇప్పటికీ అతను కోలుకోలేదు.
* కోహ్లీ అబద్దాలు : విరాట్ కోహ్లీకి కెప్టెన్సీని వదులుకోవద్దని అప్పటి అధ్యక్షుడు గంగూలీ, విరాట్ కోహ్లీకి ముందే సూచించాడు. కోహ్లీని కెప్టెన్‌గా తొలగించాలనేది నాతోపాటు బీసీసీఐ సెలక్టర్ల సమిష్టి నిర్ణయం. కానీ విరాట్ తాను గేమ్, బోర్డు కంటే పై స్థాయిలో ఉన్నానని భావించాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంగూలీకి వ్యతిరేకంగా మాట్లాడాడు. కోహ్లీ అవాస్తవాలు చెప్పాడు. గంగూలీ చెప్పిందే నిజం.
కెప్టెన్సీ పాత్రకు సంబంధించి గంగూలీ నుంచి ఎలాంటి సలహా రాలేదని విరాట్ ఉద్దేశపూర్వకంగా అన్నాడు. కోహ్లీ ఇప్పటికీ గంగూలీనే తనను కెప్టెన్సీ నుంచి తొలగించాడని భావిస్తున్నాడు. బీసీసీఐ కోహ్లీకి వ్యతిరేకంగా ఉంది, అలా అని రోహిత్ శర్మకు అనుకూలంగా లేదు. గంగూలీకి విరాట్ అంటే ఇష్టం లేదు. వైట్ బాల్ క్రికెట్లో ఒక కెప్టెన్ మాత్రమే ఉండాలనేది BCCI అసలు ఆలోచన.