భారత్ : గ్రూప్ 2 నుంచి టీమిండియా సెమీస్ రేసులో ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడింటిలో గెలిచి ఒక దాంట్లో ఓడి 6 పాయింట్లతో గ్రూప్ టాపర్ గా ఉంది. భారత్ నేరుగా సెమీస్ చేరాలంటే జింబాబ్వేతో జరిగే తన ఆఖరి పోరులో నెగ్గాలి. ఓడితే మాత్రం నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడాలి. లేదంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ మ్యాచ్ రద్దు కావాలి. అది జరగకపోయినా పాక్ పై బంగ్లా 10 పరుగుల తేడాలోపు గెలవాలి.
దక్షిణాఫ్రికా : దక్షిణాఫ్రికా తన చివరి మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై నెగ్గితే నేరుగా సెమీస్ చేరుకుంటుంది. ఒక వేళ ఓడితే మాత్రం సెమీస్ అవకాశాలు చేజారతాయి. ఎందుకంటే సఫారీ జట్టుకు ప్రస్తుతం 5 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. భారత్ కు ఆరు పాయింట్లు ఉన్నాయి. ఇక పాక్, బంగ్లా జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ఏ జట్టు గెలిచినా వాటికి 6 పాయింట్లు అవుతాయి. దాంతో సఫారీ జట్టు సెమీస్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన పరిస్థితి.
పాకిస్తాన్ : పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే తన చివరి పోరులో బంగ్లాదేశ్ పై తప్పక నెగ్గాలి. ఓడినా లేక వర్షంతో రద్దయినా పాక్ ఇంటికి చేరుతుంది. బంగ్లాపై గెలిస్తే అప్పుడు భారత్, సౌతాఫ్రికా జట్ల తమ చివరి మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. జింబాబ్వే చేతిలో భారత్ లేదా నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్, సఫారీ జట్లు తమ చివరి పోరుల్లో నెగ్గితే అప్పుడు పాక్ తన ఆఖరి మ్యాచ్ లో నెగ్గినా సెమీస్ చేరదు.
బంగ్లాదేశ్ : పాకిస్తాన్ తో జరిగే ఆఖరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ భారీ తేడాతో నెగ్గాలి. దాదాపు 100 పరుగుల తేడాతో నెగ్గాలి. అప్పటికి కూడా బంగ్లా సెమీస్ చేరుతుందని చెప్పలేం. సౌతాఫ్రికా, భారత్ జట్లలో కనీసం ఒక్క జట్టు తమ చివరి మ్యాచ్ లో ఓడాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్ జింబాబ్వే చేతిలో తక్కువ పరుగుల తేడాతో ఓడినా నెట్ రన్ రేట్ ద్వారా భారత్ సెమీస్ చేరే అవకాశం ఉంటుందిి.
ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా సెమీస్ చేరాలంటే అఫ్గానిస్తాన్ పై నెగ్గాలి. అదే సమయంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లలో కనీసం ఒక జట్టు తమ చివరి మ్యాచ్ లో ఓడాలని కోరుకోవాలి. లేదంటే అఫ్గానిస్తాన్ పై భారీ తేడాతో అంటే 150 పరుగుల తేడాతో నెగ్గాలి. అప్పుడే కివీస్, ఇంగ్లండ్ జట్ల గెలుపోటములతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది.