అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో 16 దేశాలు పాల్గొననున్నాయి. దీని కోసం, పాల్గొనే ప్రతి దేశం ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. అక్టోబర్ 16 నుంచి 22 వరకు గ్రూప్ దశ పోటీలు జరగనున్నాయి. ఇందులో 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీ పడతాయి. టాప్ 2లో నిలిచిన నాలుగు జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి.
మరోవైపు.. టీమిండియా టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఇక టి20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు చేరుకున్న భారత్ ఇప్పటికే వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లను ఆడింది. మరో రెండు వార్మప్ మ్యాచ్ లను ఈ నెల 17 ఆస్ట్రేలియాతో, 19న న్యూజిలాండ్ తో ఆడనుంది. అయితే, ఈ మెగాటోర్నీకి ముందు టీమిండియాను కొన్ని సమస్యలు వేధిస్తున్నాయి.
గత కొంత కాలంగా రోహిత్ సారథ్యంలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఇటీవల ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు టీ20 సిరీస్‌లను టీమిండియా కైవసం చేసుకుంది. ఇప్పుడు రోహిత్ తొలిసారి ప్రపంచకప్‌లో జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. 2007లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్ మళ్లీ టోర్నీని గెలవలేకపోయింది.
డెత్ ఓవర్ల ఫోబియా : టీమిండియాను అన్నిటికన్నా ఎక్కువ వేధిస్తున్న సమస్య డెత్ ఓవర్ల బౌలింగ్. డెత్ ఓవర్లలో పరుగుల్ని ఆపడానికి టీమిండియా దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదు. జస్ప్రీత్ బుమ్రా గాయం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. ఆస్ట్రేలియాలోని పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. కానీ, డెత్ ఓవర్లలో ఇటీవల భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీల ప్రదర్శన అంతగా బాగాలేదు. కాబట్టి ఈ ముగ్గురు డెత్ ఓవర్లలో పరుగులను ఎలా నియంత్రిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రపంచకప్‌లో టాప్-6 జట్లలో జోస్ బట్లర్ (ఇంగ్లండ్) మినహా, ప్రపంచకప్‌లో జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం లేని రెండో కెప్టెన్ రోహిత్. ఈ కష్టాలన్నింటినీ అధిగమించి రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ గెలిస్తే ఏ క్రికెట్ ఫార్మాట్లోనైనా ఈ ఘనత సాధించిన మూడో కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. గతంలో కపిల్ దేవ్ 1983లో వన్డే, 2007లో మహేంద్రసింగ్ ధోనీ టీ20, 2011లో వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్నారు.