ఈ జాబితాలో ఇంగ్లండ్ మొదటి స్థానంలో ఉంది. 2010లో చాంపియన్ గా నిలిచిన ఇంగ్లండ్ మరోసారి టి20 ప్రపంచకప్ లో విశ్వ విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది. బట్లర్, హేల్స్, మలాన్, లివింగ్ స్టోన్, బ్రూక్స్, బెన్ స్టోక్స్ లాంటి పవర్ ఫుల్ హిట్టర్స్ ఉన్నారు. పాకిస్తాన్, ఆస్ట్రేలియాలపై సిరీస్ విజయాలను నెగ్గిన ఇంగ్లండ్ ఈ ప్రపంచకప్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది.
సొంత గడ్డపై టి20 ప్రపంచకప్ జరుగుతుండటం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చే అంశం. భారత్, ఇంగ్లండ్ తో జరిగిన టి20 సిరీస్ లను కోల్పోయినా కూడా ఆసీస్ ను తక్కువగా అంచనా వేయలేం. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగుపెడుతున్న ఆసీస్ కు ఆల్ రౌండర్లు బలం. వార్నర్, ఫించ్, స్మిత్ అనుభవానికి స్టార్క్, హేజల్ వుడ్, కమిన్స్ బౌలింగ్ తోడైతే ఆ జట్టును ఆపడం కష్టం. ఇక మ్యాక్స్ వెల్, స్టొయినిస్, వేడ్, టిమ్ డేవిడ్ రూపంలో మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. మిచెల్ మార్ష్ సూపర్ ఫామ్ లో ఉండటం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. మ్యాక్స్ వెల్ ఫామ్ కాస్త ఇబ్బంది పెడుతున్నా అతడు కూడా లయ అందుకుంటే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు. సొంత మైదానంలో ఆడుతుండటం ఆ జట్టుకు కలిసి రానుంది.
ఎంతటి పేలవ ఫామ్ లో ఉన్నా.. ఐసీసీ టోర్నీలంటే చాలు న్యూజిలాండ్ చెలరేగిపోతుంది. ఈ మధ్య కాలంలో జరిగిన ప్రపంచకప్ ఈవెంట్స్ లో నిలకడైన ప్రదర్శనను కనబరిచింది. 2015, 2019 వన్డే ప్రపంచకప్ లలో.. 2021 టి20 ప్రపంచకప్ లో ఫైనల్ వరకు చేరుకుంది. బౌలింగ్ ఈ జట్టు ప్రధాన బలం. బౌల్ట్, సౌతీలతో పాటు నీషమ్ కీలకం కానున్నారు. ఇక బ్యాటింగ్ లో ఫిన్ అలెన్, గప్టిల్, కాన్వేలు చెలరేగితే ఈ జట్టును ఆపడం కష్టం. ముఖ్యంగా ఫిన్ అలెన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు.
సెమీస్ దాటని టీంగా సౌతాఫ్రికాకు ఒక చెడ్డ పేరు ఉంది. ఎంత గొప్పగా ఆడినా సెమీఫైనల్లో చేతులెత్తేయడం ఈ జట్టుకు ఉన్న చెడ్డ అలవాటు. అందుకే ప్రొటీస్ ను చోకర్స్ అని పిలుస్తారు. అయితే ఈసారి మాత్రం టీం చాలా బలంగా కనిపిస్తుంది. బవుమా ఫామ్ ను మినహాయిస్తే సౌతాఫ్రికాకు పెద్దగా బలహీనతలు లేవు. డికాక్, మార్కరమ్, క్లాసెన్, మిల్లర్ లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇక బౌలింగ్ కూడా బలంగానే ఉంది.
ఈ నాలుగు జట్లతో పాటు శ్రీలంకకు కూడా టి20 ప్రపంచకప్ గెలిచే సత్తా ఉంది. ఆసియా కప్ లో చాంపియన్ గా నిలువడం ఆ జట్టు కాన్ఫిడెన్స్ ను బూస్ట్ చేసింది. సమష్టిగా ఆడుతుండటం ఆ జట్టు ప్రధాన బలం. 8వ నంబర్ వరకు బ్యాటింగ్ చేయగల సత్తా శ్రీలంక సొంతం. 2007లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియాను శ్రీలంక గుర్తు చేస్తుంది.