క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించడానికి మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా ధనాధన్ టోర్నీ టీ20 వరల్డ్ కప్ 2022 (T20 World Cup 2022)ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. కొన్ని జట్లు ప్రాక్టీస్ లో నిమగ్నమైతే.. మరికొన్ని టీమ్స్.. ఇతర జట్లతో సిరీస్ లు ఆడుతూ కావాల్సినంత ప్రాక్టీస్ సంపాదించుకుంటున్నాయి.
అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా (Australia) వేదికగా టి20 ప్రపంచకప్ (T20 World Cup) జరగనుంది. 15 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న టి20 ప్రపంచకప్ ను ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలగా టీమిండియా (Team India) ఉంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఈ నెల 23న జరిగే మ్యాచ్ తో భారత్ తన ప్రపంచకప్ టైటిల్ వేటను ఆరంభిస్తుంది.
ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ గెలవడం అంత చిన్న విషయం కాదు. దాని కోసం ఎంతో బలమైన జట్టు, అంతకుమించి పక్కా గేమ్ ప్లాన్ అవసరం. కేవలం టోర్నీ ఆడుతున్నప్పుడే కాదు.. టోర్నీ ఆరంభానికి ముందే కప్ గెలిచేందుకు ఒక పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలి. ఈ మెగాటోర్నీకి ముందే టీమిండియాకు జస్ప్రీత్ బుమ్రా రూపంలో పెద్ద షాక్ తగిలింది.
పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది కూడా గాయంతో కొంత కాలం నుంచి జట్టుకు దూరమయ్యాడు. ఈ మధ్యనే కోలుకున్నాడు. కోలుకున్నా.. షాహీన్ అఫ్రిదిని ఇంగ్లండ్, న్యూజిలాండ్ సిరీస్ లకు దూరం పెట్టింది. ఓన్లీ టీ20 వరల్డ్ కప్ మ్యాచులకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు షాహీన్ అఫ్రిది. ఈ విషయంలో బీసీసీఐ కన్నా పాక్ ఎంతో తెలివిగా వ్యవహరించిందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇలా ముందు చూపుతో టీ20 వరల్డ్ కప్ కంటే ముందు ఒక మంచి ప్రాక్టీస్ సెషన్ లాంటి సిరీస్‌ను పాక్ క్రికెట్ బోర్డు పకడ్బంధీగా ప్లాన్ చేసింది. మరి ఇదే టైమ్‌లో టీమిండియా ఏం చేస్తుందంటే.. ఆస్ట్రేలియా వెళ్లి నెట్ ప్రాక్టీస్‌లు చేస్తోంది. ప్రాక్టీస్ చేయడం మంచిదే కానీ.. ఇంటర్నేషనల్ లెవెల్లో న్యూజిలాండ్ లాంటి టీమ్‌తో ఆడితే వచ్చే కాన్ఫిడెన్స్ ముందు నెట్ ప్రాక్టీస్ ఎందుకూ పనికి రాదు.
టీ20 వరల్డ్ కప్ కంటే ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లాంటి బలమైన జట్లతో టీ20 సిరీస్‌లు ఆడారు కదా అనుకుంటే.. అవి రెండు సిరీస్‌లు స్వదేశంలో జరినవే.. మన దేశంలో మన పిచ్‌లపై ఆడి గెలవడం.. మన జబ్బలు మనం చర్చుకున్నట్లే. ఉపఖండపు పిచ్‌లకు.. ఆస్ట్రేలియా పిచ్‌లకు చాలా తేడా ఉంటుంది. ఈ విషయంలో కూడా బీసీసీఐ కన్నా పీసీబీ బెటర్ ఆలోచనతో ఉందని అర్ధమవుతుంది.