ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup 20222)లో సెమీఫైనల్లో భాగంలో ఇవాళ భారత్, ఇంగ్లండ్ (IND vs ENG) తలపడనున్నాయి. భారత్‌తో పాటు ఇంగ్లండ్(England) కూడా వరల్డ్ కప్ ఫేవరేట్ టీమ్స్‌లో ఒకటి. దీంతో ఈ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. రెండో సెమీఫైనల్‌ను డిసైడ్ చేసే ఇరు జట్లకు చెందిన కొన్ని విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
గ్రౌండ్ నలుదిక్కులా బంతిని స్టాండ్స్‌లోకి పంపించే బ్యాటింగ్ స్కిల్స్ సూర్య సొంతం. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. ఇక, కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు అంతగా రాణించలేదు. హిట్‌మ్యాన్ కూడా రాణిస్తే.. భారత్‌ను అడ్డుకోవడం ఇంగ్లిష్ జట్టుకు సవాలే.
* తుది జట్టులో రిషబ్ పంత్..? : వికెట్ కీపర్ ఎంపిక విషయంలో భారత జట్టు మేనేజ్మెంట్ దృష్టిసారించాల్సి ఉంటుంది. మంచి ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దినేష్ కార్తీక్ వరల్డ్ కప్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అతన్ని ఈ మ్యాచ్‌లో పక్కన పెట్టే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోపక్క లెగ్ స్పిన్నర్ రషీద్ నుంచి వచ్చే ముప్పును దృష్టిలో ఉంచుకుని రిషబ్ పంత్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
* బ్యాలెన్స్డ్గా ఇంగ్లండ్ బౌలింగ్ దళం : భారత్ కంటే ఇంగ్లిష్ జట్టే బౌలింగ్ విభాగంలో బలంగా కనిపిస్తోంది. సామ్‌కరన్, మార్క్ వుడ్ వికెట్ల వేటలో ముందు ఉన్నారు. ముఖ్యంగా సామ్ కరన్ పేస్ అటాకింగ్‌తో బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇక వుడ్ విషయానికి వస్తే..మెరుపు వేగంతో లైన్ అండ్ లెంగ్త్ డెలివరీలు వేయడం అతని ప్రత్యేకత.
* ఇంగ్లండ్‌కు ఫ్లస్ కానున్న ఆల్ రౌండర్లు.. : వరల్డ్ క్రికెట్లోని టాప్ ఆల్ రౌండర్లలో బెన్ స్టోక్ ఒకడు. బ్యాటింగ్‌తో పాటు అద్భుతంగా ఫాస్ట్ బౌలింగ్ చేయగలడు. మరో ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. దీంతో భారత్ తొలి ఆరు ఓవర్లలో శుభారంభం లభించడం అంత సులభం కాదు. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లిష్ బౌలర్లు ఏ మ్యాచ్‌లోనూ ఎక్కువ పరుగులు ఇవ్వలేదు. పైగా చాలా మంది ఆల్ రౌండర్లు ఉండటం ఆ జట్టుకు బాగా కలిసొచ్చే అంశం.
* ఇరు జట్ల నుంచి ఇద్దరు స్నిన్నర్లు బరిలో.. : గ్రూప్ స్టేజీలో అడిలైడ్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో పిచ్ మందగించింది. పెద్దగా బౌన్స్ కాలేదు. దీంతో రేపటి మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్లో పిచ్‌పై భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌లను ఎదుర్కొవడం ఇంగ్లిష్ బ్యాటర్లకు అంత సులువు కాదు. ఇక ఇంగ్లండ్ నుంచి ఆదిల్ రషీద్, మొయిన్ అలీ బరిలో ఉండే అవకాశం ఉంది.
* భారత బౌలర్లు రాణిస్తేనే.. : భారత బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ అద్భుతంగా రాణించాల్సి ఉంది. ముఖ్యంగా ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్‌ను ఎంత త్వరగా ఔట్ చేస్తే అంత మంచిది. లేకపోతే అతని విధ్వంసానికి అడ్డు అదుపు ఉండదు. మరో బ్యాటర్ అలెక్స్ హేల్స్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఇద్దరిని కట్టడి చేయడంలో భారత బౌలర్లు ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలంటే కొద్ది గంటల వరకు ఆగాల్సిందే.