ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2022) సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. మొదటి సెమీస్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ (NZ vs PAK) పోటీపడుతుంది. రెండో మ్యాచ్‌లో ఇండియా ఇంగ్లండ్ (IND vs ENG)ను ఢీకొట్టనుంది. అయితే, కీలక మ్యాచుకు ముందు టీమిండియాను కొన్ని విషయాలు భయపెడుతున్నాయి.
* భారాన్ని మోసిన కోహ్లి, సూర్యకుమార్ : ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ టీ20 మ్యాచ్‌లలో కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ రాణించారు. ప్రతి మ్యాచ్‌లో కోహ్లి లేదా సూర్య హాఫ్ సెంచరీ కొట్టారు. దీంతో లోయర్ ఆర్డర్‌పై జట్టు ఎక్కువగా ఆధారపడలేదు. కానీ ప్రతి మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ రాణిస్తుందనే హామీ ఇవ్వలేం.
* హార్డ్ లెన్త్ బాల్స్‌తో సమస్య : గత సంవత్సరం ఇంగ్లండ్ భారత్‌లో పర్యటించినప్పుడు.. మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ ద్వయం పాండ్యా బ్యాటింగ్‌లో లోపాన్ని బయటపెట్టింది. షార్ట్ బాల్, హార్డ్ లెన్త్ డెలివరీలతో పాండ్యాను పరీక్షించారు. వారి వేగం, లెన్త్కు పాండ్యా సమాధానం చెప్పలేకపోయాడు. ఇతర జట్లు కూడా ఇదే వ్యూహాన్ని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌పై ప్రయోగించాయి.
T20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా బాగా సెట్ అయిన పాండ్యా, హారిస్ రవూఫ్ బాల్స్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు. వుడ్ T20 ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు 154.74 kmph వేగంతో బౌలింగ్ చేసి రికార్డు నెలకొల్పాడు. పిచ్ నుంచి గొప్ప బౌన్స్ కూడా రాబడుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగే సెమీ ఫైనల్‌కు ముందు ఈ సమస్య నుంచి బయటపడేందుకు మన టీమ్ ఆలోచించాల్సిన అవసరం ఉంది.
* పరుగులు చేయలేకపోతున్న దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్ : మంచి ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దినేష్ కార్తీక్, ఇండియన్ టీమ్‌లోకి అడుగుపెట్టాడు. అయితే తాజా T20 ప్రపంచ కప్‌లో కార్తీక్ నిరూపించుకోలేదు. అందుకే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అతనిని తప్పించి రిషబ్‌పంత్‌కు అవకాశం ఇచ్చారు. అక్షర్ పటేల్ కూడా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. అతనికి వచ్చిన అవకాశాలలో ప్రతిభ చూపలేదు.
కార్తీక్, అక్షర్ విఫలమవుతుండటంతో ఫినిషింగ్ బాధ్యత పాండ్యాపై పడుతోంది. ఐదు, లేదా ఆరోస్థానంలో ఇన్నింగ్స్ రెండో భాగంలో పాండ్యా బ్యాటింగ్‌కు వస్తున్నాడు. సెటిల్ అవ్వడానికి అవసరమైన సమయం కూడా పాండ్యాకు ఉండదు. భారీ షాట్లు ఆడగల ఈ బ్యాటర్‌కు ఫామ్ సమస్యగా మారింది. అందులోనూ సహచరులు కూడా విఫలమవుతుండటంతో పాండ్యాపై ఒత్తిడి కనిపిస్తోంది.