గురువారం సిడ్నీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం టీమిండియా సిద్ధమవుతుంది. పాక్ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే సిడ్నీకి చేరుకున్న భారత ఆటగాళ్లు ఆ రోజు విశ్రాంతి తర్వాత ప్రాక్టీస్ ప్రారంభించారు. మంగళవారం ఆప్షనల్ ప్రాక్టీస్ ఉన్నప్పటికీ ఆటగాళ్లంతా నెట్స్‌లో శ్రమించారు. కోహ్లి, రోహిత్, రాహుల్, కార్తీక్, పంత్, హుడా దాదాపు 2 గంటల సెషన్లో పాల్గొన్నారు.
ఇండియన్ ఫుడ్‌కు బదులు సాండ్విచ్లు పెట్టారని ఆటగాళ్లు ఆరోపించారు. 'ఆహారం ప్రమాణాల మేర లేదు. ప్రాక్టీస్ సెషన్ అనంతరం సాండ్విచ్ తినలేం'' అని ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. ఇక టీమిండియా ఆటగాళ్లకు సరైన ఆహారం ఏర్పాటు చేయకపోవడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇక, టోర్నీ ఆరంభానికి ముందు కూడా టీమిండియాకి అవమానం జరిగిన సంగతి తెలిసిందే. వార్మప్ మ్యాచ్ ల కు టీమిండియాకు కల్పించిన వసతులపై విమర్శలు వ్యక్తమయ్యాయి. భారత జట్టు సభ్యులు ఉండటానికి బ్రిస్బేన్‌లోని ఫోర్-స్టార్ హోటల్లో గదులు కేటాయించారు. అయితే ఆతిథ్య ఆస్ట్రేలియా టీం సభ్యులకు మాత్రం ఫైవ్-స్టార్ హోటల్లో వసతి కల్పించడం విమర్శలకు దారి తీసింది.
ఇక, నెదర్లాండ్ మ్యాచుకు టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం కన్పిస్తుంది. అయితే, హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి కల్పిస్తారన్న వార్తలను రాహుల్ ద్రవిడ్ కొట్టిపారేశాడు. హార్దిక్ అన్ని మ్యాచులు ఆడాలనుకుంటున్నట్టు ద్రవిడ్ తెలిపాడు. అయితే, అక్షర్ పటేల్ స్థానంలో రిషబ్ పంత్ ను జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.