యూఏఈ వేదికగా జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ (T-20 World Cup 2021) ఫ్యాన్స్ అంచనాలకు అందకుండా సాగుతోంది. ఈ మెగాటోర్నీలో హాట్ ఫేవరేట్లు బొక్క బొర్లాపడుతుంటే.. మరి కొన్ని జట్లు అద్భుత విజయాలతో దూసుకుపోతున్నాయ్. ఇక, టైటిల్ కొట్టే జట్టుగా బరిలోకి దిగిన టీమిండియా (Team India)కి ఫస్ట్ మ్యాచ్ లోనే ఘోర పరాభవం ఎదురైంది. దీంతో, హాట్ ఫేవరేట్ గా ఉన్న టీమిండియా.. పాకిస్థాన్ (pakistan) తో జరిగిన మ్యాచ్ లో ఓడి అసలు సెమీస్ బెర్త్ అయినా దక్కించుకుంటుందా..? అనే డౌట్ మొదలైంది.
ఇక, సెమీస్ రేస్ లో నిలవాలంటే టీమిండియాకు ప్రతి మ్యాచ్ అగ్ని పరీక్షే.ఈ నెల 31 న తమ తదుపరి మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఢీకొనబోతోంది కోహ్లీసేన. అయితే పాకిస్థాన్ చేతిలో ఓడిన న్యూజిలాండ్‌ది కూడా ఇదే పరిస్థితి. దీంతో, ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండటంతో ఈ ఫైట్ ఇంట్రెస్టింగ్ సాగడం ఖాయం. మరోవైపు, ఐసీసీ టోర్నీల్లో గత 18 ఏళ్లుగా టీమిండియాపై న్యూజిలాండ్ కు ఓటమే లేదు.
ఇక, న్యూజిలాండ్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా రెండు మార్పులు చేయాలని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న భువనేశ్వర్ కుమార్, సూర్యకుమార్ యాదవ్‌లను బెంచ్‌కు పరిమితం చేసి వారిస్థానాల్లో ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్‌ను ఆడించాలన్నాడు. అంతేకాకుండా ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా ఆడిస్తే పవర్ ప్లేలో టీమిండియా ధాటిగా పరుగులు చేయగలదని అభిప్రాయపడ్డాడు.
టీ20 ప్రపంచకప్ 2021 కోసం భారత ఆటగాడు హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా ఎంపికయ్యాడు. కానీ అతడు బౌలింగ్ చేయడానికి ఇంకా ఫిట్‌గా లేనట్లుగా కన్పించాడు. అందుకే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ బౌలింగ్ చేయలేదు. ఇక బ్యాట్‌తోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే యూఏఈలో ఐపీఎల్ 2021లో కూడా పెద్దగా రాణించలేదు. గత కొంత కాలంగా హార్దిక్ ఫామ్‌లో లేడు.