క్రికెట్లో టీ 20 అంటేనే ఉత్కంఠ. టీ 20 అంటే ఉత్సాహం. టీ 20 అంటే ఉద్వేగం. ఈ మూడు కలగలిపి ఒకేసారి వచ్చే సందర్భం సూపర్ ఓవర్. ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాక.. విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఆడిస్తుంటారు. ఈ సందర్భం ఎప్పుడో కానీ రాదు. కానీ వచ్చిందంటే... ఆ సందడి మామూలుగా ఉండదు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ (T-20 World Cup 2021)లో సూపర్ ఓవర్ వస్తే ఏ జట్టు ఎవరిని బరిలోకి దింపుతుందో ఓ లుక్కేద్దాం.
ఇండియా : భారత జట్టు ఒకవేళ సూపర్ ఓవర్ ఆడితే... బౌలింగ్ వేసే అవకాశం కచ్చితంగా మన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు దక్కుతుంది. డెత్ ఓవర్ డెడ్లీ బౌలర్ అతడు. ఇక బ్యాట్స్‌మన్ గురించి మాట్లాడాలంటే... సూపర్ ఓవర్‌ని సూపర్‌గా ఆడగల ఆటగాళ్లలో రోహిత్ శర్మ తొలి స్థానంలో ఉంటాడు. అతనికి తోడు కేఎల్ రాహుల్ ఉంటాడు. లేదంటే స్పైడీ రిషబ్ పంత్ ఎలాగూ ఉన్నాడు.
న్యూజిలాండ్ : న్యూజిలాండ్ జట్టు సూపర్ ఓవర్ల కోసం కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను నమ్ముకోవచ్చు. అతనితోపాటు ఓపెనర్ మార్టిన్ గప్తిల్ బరిలోకి దిగుతాడు. లేదంటే జిమ్మీ నీషమ్‌కు కూడా అవకాశం ఉంది. ఇక బౌలర్ సంగతికొస్తే... ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ లాంటి స్టార్లు ఉన్నా, లాకీ ఫెర్గూసన్వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఇంగ్లండ్ : ఇంగ్లండ్‌లో సూపర్ ఓవర్ సూపర్ హీరోలు అంటే జాస్ బట్లర్, జాసన్ రాయ్, జానీ బెయిర్ స్టోనే కనిపిస్తారు. భారీ హిట్టింగ్ చేయగలిగి, సెన్సిబుల్ స్ట్రోక్ ప్లే ఆడగలరు. అందుకే ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వారిని నమ్ముకోవచ్చు. ఇక బౌలర్ విషయానికొస్తే.. మార్క్ వుడ్ ను ఆప్షన్ గా ఎంచుకోవచ్చు.
ఆస్ట్రేలియా : సూపర్ ఓవర్ పరిస్థితి వస్తే... ఆస్ట్రేలియా నమ్ముకోదగ్గ బౌలర్ మిచెల్ స్టార్క్ అని చెప్పొచ్చు. వరుస యార్కర్లు వేయడంతో దిట్ట అతను. ఇక బ్యాటర్ల పరిస్థితి చూస్తే... డేవిడ్ వార్నర్ కచ్చితంగా ఉంటాడు. అతను కాకుండా గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్ పేర్లు గుర్తుకొస్తాయి. ఎలాంటి బంతినైనా అమాంతం స్టాండ్స్‌లోకి కొట్టడం వీళ్ల ప్రత్యేకత మరి.
పాకిస్థాన్ : ప్రపంచకప్ లాంటి కీలక టోర్నీలో సూపర్ ఓవర్ అంటే.. ఏ జట్టయినా బెస్ట్ పెయిర్‌ను పంపాలని చూస్తుంది. పాకిస్థాన్‌కు కనిపించే బెస్ట్ పెయిర్ ఫకర్ జమాన్, బాబర్ ఆజామ్ అని చెప్పొచ్చు. మూడో పేరు కావాలంటే మహ్మద్ రిజ్వాన్‌ను ఎంచుకోవచ్చు. ఇక బౌలర్ సంగతి అంటే... షహీన్ అఫ్రిదీకే ఓట్లు పడతాయి.
బంగ్లాదేశ్ : ఐసీసీ టోర్నీలు అంటే సింహాల్లా రెచ్చిపోతుంటారు బంగ్లాదేశ్ కుర్రాళ్లు. మరి సూపర్ ఓవర్ అంటే ఆ జట్టు ఎవరిని బరిలోకి దింపుతుంది? రీసెంట్గా ది బెస్ట్ అనిపించుకున్న మహ్మదుల్లా రియాద్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్ టాప్ ప్లేస్‌లో ఉంటారు. ఇక బౌలర్ విషయానికొస్తే కచ్చితంగా ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఎంచుకుంటారు. కారణం అతని యార్కర్ల నైపుణ్యమే అని ప్రత్యేకంగా చెప్పాలా?
వెస్టిండీస్ : వెస్టిండీస్‌లో అందరూ హిట్టర్లే... అందులో బెస్ట్ హిట్టర్లు అంటే క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, ఆండ్రూ రస్సెల్. ఇంకేముంది సూపర్ ఓవర్ ఆడే పరిస్థితి వస్తే ఈ ముగ్గురే ముందుంటారు. అయినా ఈ విషయంలో వెస్టిండీస్ లెక్క తేల్చడం చాలా ఈజీ. బౌలర్ విషయంలోనూ ఈజీగానే గెస్ చేయొచ్చు. డెత్ ఓవర్లలో డిఫరెంట్ బౌలింగ్ వేసే డ్వేన్ బ్రావోనే ఆప్షన్.
దక్షిణాఫ్రికా : దక్షిణాఫ్రికా ఒకవేళ సూపర్ ఓవర్ ఆడే పరిస్థితి వస్తే... బౌలర్‌గా ఎంచుకునేది కగిసో రబాడానే. ఎందుకంటే అతనికి సూపర్ ఓవర్ల అనుభవం చాలా ఎక్కువ. ఇక బ్యాట్స్‌మన్ సంగతికొస్తే తొలి ప్రాధాన్యం క్వింటన్ డికాక్. ఇందులో నో డౌట్. ఇక మిగిలిన ఇద్దరు అయితే ఒకరు డేవిడ్ మిల్లర్, మరొకరు రాసీ వాన్ డెర్ డసన్ అవ్వొచ్చు.