పిచ్ తో సంబంధం లేకుండా తనకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో 200కు పైగా స్ట్రయిక్ రేట్ తో పరుగులు సాధించడం సూర్యకుమార్ ప్రత్యేకత. అయితే.. అద్భుతమైన ట్యాలెంట్ ఉన్నా, దేశవాళీల్లో సత్తా చాటినా సరే కొన్నేళ్ల క్రితం వరకూ సూర్యకుమార్‌ను సెలెక్టర్లు నిర్లక్ష్యం చేశారు. అతనికి భారత జట్టులో చోటు లభించలేదు. దీనిపై సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
" నాకు గతం ఎప్పుడూ గుర్తొస్తుంటుంది. ఒంటరిగా ఉన్నా, నా భార్యతో ట్రావెల్ చేస్తున్నా దాని గురించే మాట్లాడుకుంటాం. రెండు, మూడేళ్ల క్రితం పరిస్థితి గురించే చర్చించుకుంటాం. అలాగే అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా వచ్చిందా? అని ఆశ్చర్యపోతాం. అప్పుడు ఫస్ట్రేషన్ ఉండటం నిజమే. అయితే ఆ పరిస్థితిలో కూడా ఏదైనా పాజిటివ్ ఉందా? దాన్నుంచి ఏమైనా నేర్చుకోవచ్చా? అనే ఆలోచించేవాడిని. ఒక్కో అడుగు ముందుకు ఎలా వెయ్యాలి? ఇంత కంటే మంచి క్రికెటర్ ఎలా అవ్వాలి? అని శోధించేవాడిని " అని చెప్పుకొచ్చాడీ స్టార్ బ్యాటర్.
తన తల్లిదండ్రులతో రోజు ఓ అరగంట మాట్లాడుతానని తెలిపాడు. ఫ్యామిలీతో గడపడం వల్ల తాను చాలా ప్రశాంతంగా ఉంటానని, వారి మాటలు తనను ఒదిగి ఉండేలా చేస్తాయని తెలిపాడు. 'నేను ఎప్పుడూ నా జోన్లోనే ఉండేందుకు ప్రయత్నిస్తాను. నా పెళ్లాం ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఏ పర్యటనకు వెళ్లినా ఆమెను నా వెంట తెచ్చుకుంటాను. ఆఫ్ డేలో ఆమెతోనే గడుపుతాను.
ఇక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో బ్యాటింగ్ చేయడం చాలా ఇష్టమని తెలిపాడు. ఒకరికొకరం గౌరవించుకొని బ్యాటింగ్ చేస్తామని చెప్పిన సూర్య.. కోహ్లీతో బ్యాటింగ్ చేసేటప్పుడు వికెట్ల మధ్య బాగా పరుగెత్తాల్సి వస్తుందన్నాడు. కోహ్లీ సూపర్ ఫిట్‌గా ఉంటాడని, అతనిలా పరుగెత్తడం చాలా కష్టమని తెలిపాడు. ఇక తన ఇన్నింగ్స్‌పై విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్‌ను గొప్ప ప్రశంసగా తీసుకుంటానని, తన ఆటను మరింత మెరుగుపరుచుకుంటానని తెలిపాడు.
ఇక, టెస్ట్ క్రికెట్ లో చోటు దక్కించుకోవడంపై కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. 'క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు ముందుగా రెడ్ బాల్ క్రికెట్ ఆడతాం. నేను కూడా మా ముంబై జట్టు తరఫున చాలా కాలం ఆడాను. కాబట్టి నాకు టెస్టు ఫార్మాట్‌పై ఒక అవగాహన ఉంది. నాకు ఆ ఫార్మాట్ ఆడటం ఇష్టం కూడా. త్వరలోనే టెస్టుల్లో కూడా ఆడతానని అనుకుంటున్నా' అని సూర్యకుమార్ అన్నాడు. ఇంతకుముందు రెండు, మూడుసార్లు అతన్ని టెస్టు జట్టులోకి తీసుకున్నప్పటికీ.. మ్యాచ్‌లో ఆడే అవకాశం మాత్రం దక్కలేదు.