ఐపీఎల్ (IPL) హిస్టరీలో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్(Mumbai Indians). ఈ ఫ్రాంఛైజీ ఏకంగా ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుని, లీగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. కానీ లాస్ట్ సీజన్ IPL 2022లో అభిమానులను నిరాశపరిచింది. 14 మ్యాచ్‌లలో 10 ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబైలో చెప్పుకోదగ్గ ఆగటాళ్లు ఉన్నా.. టీమ్ ఘోరంగా విఫలమైంది.
త్వరలో మొదలుకాబోతున్న ఐపీఎల్- 2023లో ముంబై దశ మారుతుందని క్రికెట్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఇటీవల టీ20ల్లో సంచనల బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ ముంబైకి అతిపెద్ద బలంగా కనిపిస్తున్నాడు. 19 ఏళ్ల డెవాల్డ్ బ్రెవిస్ రూపంలోనూ టీమ్‌కు మంచి ప్లేయర్ దొరికాడు. ఈ ఐపీఎల్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ముంబైలో కీలకంగా మారుతారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
* ఆకాశమే హద్దుగా చెలరేగిన SKY : సూర్యకుమార్ యాదవ్ గత రెండేళ్లుగా టీ20 క్రికెట్లో నిలకడగా రాణిస్తూ భారత జట్టులో కీలకంగా నిలిచాడు. 2021 నుంచి అతడు ముంబై తరఫున ఐపీఎల్లో విశేషంగా రాణించాడు. కొన్ని కీలక మ్యాచ్‌లలో సంచలన ప్రదర్శనతో విజయాలు అందించాడు. దీంతోనే అతనికి ఇంటర్నేషనల్ T20 క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది.
ఈ ముంబై బ్యాటర్ ఇప్పటి వరకు 45 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. మూడు సెంచరీలతో సహా 180 కంటే ఎక్కువ స్ట్రైక్-రేట్‌తో 46.41 సగటుతో 1578 పరుగులు చేశాడు. కేవలం 45 మ్యాచ్‌ల్లోనే సూర్యకుమార్ యాదవ్ T20I క్రికెట్లో నంబర్ 1 ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆ గణాంకాలే పొట్టి ఫార్మాట్లో అతడి ఆధిపత్యాన్ని చాటిచెబుతున్నాయి.
* బలంగా ముంబై ఇండియన్స్ : బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరిదీ ఒకే విధమైన ఆటతీరు. కాబట్టి బ్రెవిస్ రాకతో మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్‌పై ఒత్తిడి తగ్గుతుంది. ఓవరాల్‌గా ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ వంటి వారితో బలంగా కనిపిస్తోంది. రానున్న సీజన్లో ముంబై ఇండియన్స్ రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే టీమ్ నుంచి అద్భుతమైన ప్రదర్శనలు ఆశించవచ్చు.