పడ్డాడు..లేచాడు..! కాదు కాదు.. దూకాడు..! ఎగిరి ఎగిరి దూకాడు..! కిందకేసి కొట్టిన జంపింగ్ బాల్ల పైకిపైకి లేచాడు..! ఎంత పైకి అంటే.. పాతాళం నుంచి ఆకాశమంతా ఎత్తుకు..! అతని ఎగతాళి చేసిన నోళ్లకు ఎప్పుడో తాళాలు పడ్డాయి.. ఇప్పుడు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ని చూస్తే ఇక పడిన తాళాలు ఎప్పటికీ తెరుచుకోవు కూడా..! టీమిండియా యంగ్ గన్, హైదరాబాదీ సెన్సేషన్ సిరాజ్ దెబ్బ అలాంటిది మరి. తాజాగా ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సిరాజ్ టాప్ ప్లేస్‌కు దూసుకొచ్చాడు.
సరిగ్గా 12నెలల క్రితం సిరాజ్ టీమిండియా వన్డే జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే విమర్శలు మొదలయ్యాయి. సిరాజ్ టెస్టులకు మాత్రమే పనికి వస్తాడని కొందరి నోళ్లు తెరుచుకున్నాయి. వన్డే జట్టులో సిరాజ్ స్థానాన్ని చాలా మంది ప్రశ్నించారు. రన్ మెషీన్ అంటూ ఎక్స్‌ట్రాలు కూడా చేశారు. అటు సోషల్‌మీడియాలో అయితే విపరీతమైన ట్రోలింగ్‌కు గురయ్యాడు సిరాజ్.
నిజానికి తనకు జరిగిన అవమానాలకు సిరాజ్ చాలా బాధ పడ్డాడట..! ఈ విషయాన్ని అతనే స్వయంగా పలుమార్లు చెప్పుకున్నాడు. తండ్రి లాగా ఆటో నడుపుకోవాలంటూ సిరాజ్‌ని ఎగతాళి చేశారు కూడా. ఆటోవాలా అంటూ సోషల్‌మీడియాలో చాలా మంది ఓవరాక్షన్ కూడా చేశారు. అయితే ఆ విమర్శలే సిరాజ్‌లో పట్టుదలను పెంచాయి. ప్రపంచ టాప్ బౌలర్‌గా ఎదిగేలా కసిని పెంచాయి.
అయితే టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్నా.. పరిమిత ఓవర్ల ఫార్మెట్లో మాత్రం తన స్థానంపై సెలక్టర్లకు ఎప్పుడు సందేహమే..! బుమ్రా గాయాలతో సతమతమవుతుండడం.. భువనేశ్వర్ కుమార్ ఫామ్ లేకపోవడంతో సెలక్టర్లు సిరాజ్‌కు వన్డే టీమ్‌లో ఛాన్స్ ఇచ్చారు. అంది వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకున్న సిరాజ్ ఈ 12నెలల కాలంలో బుమ్రా లేని లోటును కెప్టెన్ రోహిత్‌కు కనిపించనివ్వలేదు.