భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza) అంటే తెలియనివారుండరు. సానియా మీర్జా తన టెన్నిస్ ఆటతోనే కాకుండా.. అందంతోనూ ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకుంది. ఇండియాలో టెన్నిస్ అంతలా పాపులర్ కావడానికి ఓ కారణం సానియా మీర్జా. సానియా మీర్జా ప్రపంచస్థాయి అగ్ర టెన్నిస్ క్రీడాకారిణిలని ధీటుగా ఎదుర్కొంది.
క్రీడాకారిణిగా ఎంతో పేరు ప్రతిష్టలు సొంతం చేసుకున్న సానియా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా అదే స్థాయిలో వార్తల్లో నిలిచింది. సానియా.. తన ఆటతో దేశాన్ని గర్వపడేలా చేసినందుకు.. భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డ్‌తో సత్కరించింది. అంతేకాకుండా సానియాను ప్రతిష్టాత్మక అవార్డు రాజీవ్ ఖేల్ రత్న కూడా వరించింది.
అలాంటి సానియా మీర్జాకు కూడా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయ్. ఆ విషయాన్ని సానియానే స్వయంగా వెల్లడించింది. మణికట్టు గాయంతో 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన తర్వాత తాను ఎంతో డిప్రెషన్‌కు లోనయ్యానని భారత వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపారు. 3-4 నెలలు తాను మానసిక సమస్యలతో సతమతమయ్యానని, ఓ నెల రోజుల పాటు భోజనం చేసేందుకు కూడా తన గది దాటకపోవడం ఇంకా గుర్తుందన్నారు. బాగానే ఉన్నానని అనిపించే లోపే కన్నీళ్లు వచ్చేవని సానియా పేర్కొన్నారు. గాయంతో చెక్ రిపబ్లిక్కు చెందిన బెనెసోవాతో తొలి రౌండ్ పోరు మధ్యలో సానియా వైదొలిగారు. అప్పటికి సానియా 1-6, 1-2తో వెనుకంజలో ఉన్నారు.
2008 బీజింగ్ ఒలింపిక్స్ సందర్భాన్ని సానియా మీర్జా ఓ చానెల్ ఇంటర్వ్యూలో తాజాగా గుర్తు చేసుకున్నారు. "2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో తొలి రౌండ్లోనే తప్పుకోవాల్సి రావడాన్ని అంత త్వరగా జీర్ణించుకోలేకపోయా. కేవలం టెన్నిస్ అనే కాదు కోర్టు బయట విషయాల్లోనూ అది ఎంతో ప్రభావం చూపింది. చాలా సార్లు మన జీవితాల్లో ఆనందం కోసం కెరీర్‌పై అతిగా ఆధారపడతాం. ప్లేయర్లుగా కెరీర్ అనేది కేవలం జీవితంలో ఒక భాగమనే విషయాన్ని మర్చిపోతాం. నిజానికి అదే మన జీవితం కాదు. నిజానికి ఆ సమయంలో చాలా బాధను అనుభవించా. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని కోరుకున్నా" అని సానియా తెలిపారు.
"ఒలింపిక్స్‌లో పోటీపడలేననే వ్యాఖ్యలు చదువుతుంటే ఎలా ఉంటుంది. ఆ మణికట్టు గాయం కారణంగా కనీసం నా జుట్టును కూడా దువ్వుకోలేకపోయా. శస్త్రచికిత్స తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో నా కుటుంబాన్ని, దేశాన్ని నిరాశపరిచానని అనిపించింది. కానీ ఆ క్లిష్టమైన దశ నుంచి కోలుకోవడంలో నా కుటుంబం ఎంతో సాయం చేసింది ఆ సమయంలో నాకు కావాల్సిన మనోస్థైర్యాన్ని వాళ్లు అందించారు. వాళ్ల అండతోనే త్వరగా కోలుకున్నా. ఆ తర్వాత దేశంలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో రెండు పతకాలు గెలిచా" అని సానియా మీర్జా చెప్పుకొచ్చారు.
ఆసియా, కామన్వెల్త్, ఆఫ్రో- ఆసియా క్రీడల్లో కలిపి మొత్తం 14 పతకాలు గెలిచిన సానియా.. ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను ఖాతాలో వేసుకుంది. ఇక పాకిస్థానీ క్రికెటర్ సోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న సానియా ఓ బిడ్డకు తల్లైంది. ప్రస్తుతం తన బిడ్డ ఆలనాపాలనా చూస్తోన్న సానియా మరోవైపు తన టెన్నిస్ అకాడమీని కూడా పర్యవేక్షిస్తోంది.