ఇండియన్ టెన్నిస్‌లో సంచలనం మన సానియా మీర్జా (Sania Mirza). దేశంలో మహిళల టెన్నిస్‌కు ఆమె ఓ దిక్సూచి. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అరుదైన మైలురాళ్లను దాటిన సానియా.. ఇప్పుడు ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించబోతోంది. 34 ఏళ్ల సానియా ఇండియా తరఫున నాలుగు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా అథ్లెట్‌గా నిలవబోతోంది.
"మన సామర్థ్యాలపై నమ్మకం ఉంచడం అన్నింటికన్నా ముఖ్యం. నేను 30ల్లో.. ఈ స్థాయిలో ఉన్నా. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించను. ఇక, భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకెంతో ఇష్టం. ముఖ్యంగా ఒలింపిక్స్ లాంటి వేదికల్లో అది గౌరవంగా భావిస్తా. నాదో అద్భుతమైన కెరీర్. ప్రస్తుతం నేను 30ల్లో ఉన్నా.. కానీ నేను వయస్సు గురించి ఎప్పుడూ ఆలోచించను. ఆటపైనే దృష్టిపెడతా.. మెగా ఈవెంట్ కోసం కోర్టులో చాలా కష్టపడుతున్నా. దీంతో పాటు మూమెంట్ పరంగా మరింత చురుకుగా ఉండేందుకు ఆఫ్ ద కోర్టు కూడా చాలా కసరత్తులు చేస్తున్నా. అంకితకు 15 ఏళ్లు ఉన్నప్పుడు తనని తొలిసారి కలిశా. క్రమశిక్షణ తన బలం. సహచర మహిళా ప్లేయర్‌తో కలిసి ఇప్పటిదాకా ఒలింపిక్స్‌లో నేను ఆడలేదు. ఈసారి చాన్స్ దొరికింది." అని సానియా చెప్పింది.
2018లో ఇజాన్‌కు జన్మనిచ్చాక గతేడాది జనవరిలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచి సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించింది సానియా. ఈ వారమే జరిగిన ఈస్ట్‌బోర్న్ ఇంటర్నేషనల్ ఈవెంట్లో తొలి రౌండ్లోనే సానియా నిరాశపరిచింది. బెతాని మ్యాటెక్ సాండ్స్ (అమెరికా)తో జతకట్టిన హైదరాబాదీకి తొలి రౌండ్లోనే చుక్కెదురైంది.