ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్‌కు అన్ని జట్లు సిద్ధమయ్యాయి. అందరి చూపు ఈసారి 5 సార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ పైనే ఉంటుంది. గత సీజన్లో జట్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టు 2022 పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో అట్టడుగున నిలిచింది. దీంతో.. ఈ సారి రెచ్చిపోవాలని రోహిత్ సేన భావిస్తుంది.
గతేడాది అర్జున్ టెండూల్కర్ ఎంట్రీపై వార్తలు వచ్చినా.. తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. అయితే ఈసారి మాత్రం అర్జున్ టెండూల్కర్ డెబ్యూ పక్కా అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ ఏడాది అర్జున్ ముంబై తరఫున ఎంట్రీ ఇవ్వకపోతే.. ఇంకెప్పుడూ జరిగే అవకాశం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. అదే జరిగితే అర్జున్ టెండూల్కర్ నెట్ బౌలర్ గా.. లేదా డ్రింక్స్ బాయ్ గానే మిగిలిపోయే అవకాశం ఉంది.
అయితే సచిన్ అభిమానులు మాత్రం అర్జున్ టెండూల్కర్ డెబ్యూపై ఆశతో ఉన్నారు. ఐపీఎల్ 2023లో అర్జున్ టెండూల్కర్ ముంబై తరఫున ఆడటం ఖాయం అని నమ్మకంగా ఉన్నారు. రోహిత్ శర్మ అర్జున్ కి తుది జట్టులో చోటు కల్పించి సచిన్ కి గురుదక్షిణ చెల్లిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అదే జరిగితే అర్జున్ టెండూల్కర్ సుదీర్ఘ నిరీక్షణకు తెర పడ్డట్లే అవుతుంది.