క్రికెట్లో.. ఆటగాళ్లు గాయపడటం మనం చూస్తూనే ఉన్నాం. వీటిలో హామ్ స్ట్రింగ్స్, ఫ్రాక్చర్స్ లేదా కండరాల పట్టేయడం వంటి అనేక గాయాలతో ఆటగాళ్లు సతమతమవతూ ఉంటారు. అయితే.. చాలా మంది క్రికెటర్లు గాయాలైనా.. వెనక్కి తగ్గడం లేదు. గాయాల్ని లెక్కచేయకుండా బరిలోకి దిగి రెచ్చిపోతున్నారు. బంగ్లాదేశ్‌పై రోహిత్ శర్మ అదే చేశాడు. అయితే.. రోహిత్ శర్మ మాత్రమే కాదు.. ఇంతకుముందు కూడా చాలా మంది ఆటగాళ్లు గాయాల్ని లెక్కచేయలేదు. వారెవరో ఓ లుక్కేద్దాం.
రోహిత్ శర్మ : బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ బొటనవేలికి గాయమైంది. గాయం తీవ్రం కావడంతో రోహిత్ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత రోహిత్‌ను ఆస్పత్రిలో చేర్చారు. ఇక, రోహిత్ గాయంతో బ్యాటింగ్ కు వచ్చే అవకాశం లేదని చాలా మంది అనుకున్నారు. కానీ.. టీమిండియా అవసరాన్ని గుర్తించిన రోహిత్.. తొమ్మిదో నంబర్ లో బ్యాటింగ్ కు వచ్చి 28 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అయినా భారత జట్టు గెలవలేకపోయింది.
అనిల్ కుంబ్లే : 2002లో వెస్టిండీస్‌తో జరిగిన ఆంటిగ్వా టెస్టులో భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే దవడకు గాయమైనప్పటికీ ఆడాడు. అతను కట్టుతోనే బౌలింగ్ చేశాడు. ఈ టెస్టు మ్యాచులో మెర్విన్ డిలియన్ వేసిన బంతికి అనిల్ కుంబ్లేకి తగిలింది. ఆ దెబ్బకి రక్తస్రావం కూడా అయింది. ప్రథమ చికిత్స తర్వాత కుంబ్లే 20 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసినా అనిల్ కుంబ్లే ముఖానికి బ్యాండేజీతో బౌలింగ్ చేస్తున్న ఫోటో ఇప్పటికీ భారత అభిమానులకు గుర్తుండిపోయింది.
గ్యారీ కిర్‌స్టన్ : 2003 లాహోర్ టెస్ట్ మ్యాచ్‌లో.. షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో గ్యారీ కిర్‌స్టెన్ తీవ్రంగా గాయపడ్డాడు. 53 పరుగులు చేసిన కిర్‌స్టన్‌ను చికిత్స నిమిత్తం అక్కడి నుంచి తీసుకెళ్లారు. స్కానింగ్ చేయగా ముక్కు పగిలిందని తేలింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కిర్‌స్టన్ 46 పరుగులు చేశాడు. పాకిస్థాన్ టెస్టు గెలిచినా ముక్కు పగిలినా.. బ్యాటింగ్ కు దిగిన కిర్‌స్టన్ తెగువను అందరు మెచ్చుకున్నారు.
యువరాజ్ సింగ్ : బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రక్తపు వాంతులు వచ్చినప్పటికీ, 2011 ప్రపంచ కప్‌లో భారత్ విజయంలో యువరాజ్ సింగ్ కీ రోల్ ప్లే చేశాడు పోషించాడు. ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో చెన్నైలో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో వేడి వాతావరణంలో గంభీర్ 8వ ఓవర్లో ఔటయ్యాడు. అప్పుడు భారత్ స్కోరు 2 వికెట్లకు 51 పరుగులు. యువరాజ్, విరాట్ నాలుగో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సమయంలో యువరాజ్ సింగ్ రక్తపు వాంతులు చేసుకున్నాడు. ఆ సమయంలోయువీ క్యాన్సర్ తో పోరాడిన సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు యువీ.
మహేంద్ర సింగ్ ధోని : 2019 ప్రపంచ కప్ సమయంలో ధోని బొటనవేలిక ఫ్రాక్చర్ అయింది. గాయం తర్వాత కూడా ధోనీ ప్రపంచకప్ మొత్తం ఆడాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బొటన వేలికి గాయమైంది. బొటనవేలు నుంచి రక్తం పీల్చి మైదానంలో ఉమ్మి వేసిన ధోని ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రపంచకప్ నుంచి భారత జట్టు నిష్క్రమించిన తర్వాత ధోనీ ఫోటోలు బయటకు వచ్చాయి. తనకు గాయమైనా... లెక్క చేయకుండా ఆడిన ధోనిని ప్రశంసించారు మాజీ క్రికెటర్లు.
గ్రేమ్ స్మిత్ : 2009లో ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్టులో మిచెల్ జాన్సన్ వేసిన వేగవంతమైన బంతికి స్మిత్ తగిలింది. అతని ఎడమ చేయి విరిగింది. 30 పరుగుల చేసిన స్మిత్ ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత ప్రోటీస్ 327 పరుగులకు ఆలౌటైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 257 పరుగులు చేసింది. అయితే, రెండో ఇన్నింగ్స్ లో స్మిత్ పదో నెంబర్ స్థానంలో బ్యాటింగ్ కు దిగి అందర్నీ ఆశ్చర్యపర్చాడు. ఈ మ్యాచులో సౌతాఫ్రికా ఓడినప్పటికీ.. స్మిత్ చూపించిన తెగువను అందరు ప్రశంసించారు.
హనుమ విహారి : సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో హనుమ విహారీ చూపిన పోరాట స్పూర్తిని ఇప్పట్లో ఫ్యాన్స్ మర్చిపోలేరు. నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు విహారి కాలు కండరాలు పట్టేశాయి. దీంతో.. తీవ్రనొప్పి అల్లాడిపోయాడు. భారత్ విజయానికి 407 పరుగులు చేయాల్సి ఉండగా.. జట్టు 4 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. కీలక సమయంలో హనుమ విహారి 2:30 గంటల మారథాన్ ఇన్నింగ్స్ ఆడి ఆస్ట్రేలియా విజయానికి అడ్డుగోడగా నిలిచాడు. ఈ మ్యాచు డ్రాగా ముగించింది టీమిండియా. ఇక, ఈ సిరీస్ ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది. హనుమ విహారీ 161 బంతులాడి.. ఆస్ట్రేలియా బౌలర్ల సహానాన్ని పరీక్షించాడు.
సచిన్ టెండూల్కర్: భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. తన కెరీర్ లో ఎన్నో సార్లు గాయాలతో బాధపడాల్సి వచ్చింది. 2003 ప్రపంచకప్ సమయంలో సచిన్ టెండూల్కర్‌కు డయేరియా వచ్చింది. డయేరియా బాధపడుతూనే.. శ్రీలంకతో పోరులో బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ 97 పరుగులు చేశాడు. ఇక, ఈ మ్యాచులో శ్రీలంకను చిత్తు చేసింది భారత్.