అనామకుడిగా ఉన్న హార్దిక్ పాండ్యాను మొదట చేరదీసింది ముంబై ఇండియన్స్. 2015లో అతడిని సొంతం చేసుకుంది. అతడిని మేటి ఆల్ రౌండర్లలో ఒకడిగా తీర్చిదిద్దింది. అనంతరం హార్దిక్ పాండ్యా అన్న కృనాల్ పాండ్యాను కూడా తీసుకుంది. ఆ తర్వాత వీరిద్దరు టీమిండియా తరఫున అరంగేట్రం కూడా చేశారు. హార్దిక్ కెప్టెన్ హోదా వరకు ఎదిగితే.. కృనాల్ పాండ్యా తనను తాను నిరూపించుకోలేకపోయాడు.
అయితే ఈ సీజన్ సందర్భంగా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ పై చేసిన కామెంట్స్ అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యాయి. ముంబై ఇండియన్స్ స్టార్లనే కొంటుందని.. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్లను తయారు చేస్తుందంటూ కామెంట్ చేశాడు. అందుకే తనకు సీఎస్కే ఇష్టమంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.. ఇది ముంబై ఇండియన్స్ అభిమానులను తీవ్రంగా బాధ పెట్టింది.
ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగే మ్యాచ్ ను ముంబై ఇండియన్స్ అభిమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో విజయం సాధించి ఫైనల్ కు అర్హత సాధించడంతో పాటు హార్దిక్ అహాన్ని అణచాలని కెప్టెన్ రోహిత్ ను కోరుతున్నారు. గుజరాత్ పై విజయం సాధిస్తే మాత్రం ముంబై ఇండియన్స్ అభిమానుల గుండెల్లో రోహిత్ చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం.