టీమిండియా దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఘోర తప్పిదం చేశాడని మండిపడ్డాడు. అయితే ఆ తప్పిదం మ్యాచ్ ఫలితాన్ని శాసించలేదని పేర్కొన్నాడు. అదృష్టవశాత్తు ముంబై విజయంతో గట్టెక్కిందన్నాడు. క్రిక్‌బజ్ షోలో ముంబై-లక్నో ఎలిమినేటర్ మ్యాచ్‌ను విశ్లేషించిన సెహ్వాగ్.. కృనాల్ చెత్త షాట్‌తో ముంబై గట్టెక్కిందన్నాడు. కృనాల్ ఔటవ్వకుండా ఉండి ఉంటే రోహిత్ చేసిన తప్పిదం అందరికి తెలిసేదన్నాడు.
లక్నోతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీ తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ముఖ్యంగా యువ బౌలర్ హృతిక్ షోకిన్‌కు పవర్ ప్లేలో బౌలింగ్ ఇవ్వడం చూసి షాకయ్యానన్నాడు. క్రీజులో అప్పటికే సెట్ అయిన డేంజరస్ బ్యాటర్ స్టోయినీస్ ఉండగా.. అనుభవం ఉన్న పీయూశ్ చావ్లాకు కాకుండా హృతిక్ షోకీన్‌కు బంతి ఇవ్వడం తనను ఆయోమయానికి గురి చేసిందన్నాడు.
షోకీన్ ఓవర్ లో స్టోయినీస్ భారీ షాట్లు ఆడాడు. ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు. క్రీజులో లెఫ్టాండర్ బ్యాటర్ ఉన్నాడనే కారణంతో రోహిత్ స్పిన్నర్ ను తీసుకొచ్చాడని తనకు అర్థమైందని సెహ్వాగ్ పేర్కొన్నాడు. అయితే ఈ సీజన్ లో ముంబై తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్న పీయూశ్ చావ్లాను కాదని షోకీన్ కు బంతిని ఇవ్వడం తనను విస్మయానికి గురి చేసిందన్నాడు.
స్ట్రాటజిక్ టైమ్ ఔట్ అనంతరం వేసిన ఓవర్ రెండో బంతికి కృనాల్ పాండ్యా భారీ షాట్ కోసం వెళ్లి వికెట్ పారేసుకున్నాడు. కృనాల్ వికెట్ తర్వాత లక్నోఇన్నింగ్స్ పేక మేడలా కూలింది. ‘ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచినా.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఘోర తప్పిదం చేశాడు. పవర్ ప్లే చివరి ఓవర్‌ను హృతిక్ షోకీన్‌కు ఇవ్వడం సరైంది కాదు’ అని సెహ్వాగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.