ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) బీసీసీఐ (BCCI) పాలిట కామధేనవు. ఆ విషయాన్ని మరో సారి రుజువు చేస్తూ.. బీసీసీఐపై మరోసారి కాసుల వర్షం కురిపించింది ఈ ధనాధన్ లీగ్. వచ్చే ఐదేళ్లకు (2023-27)గానూ ఐపీఎల్ మీడియా రైట్స్ (IPL Media Rights) ను కనీవినీ ఎరుగని రీతిలో విక్రయించింది. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ మీడియా రైట్స్ ను సొంతం చేసుకునేందుకు దేశంలోని చానెల్స్ పోటీ పడ్డాయి.
దీంతో మీడియా రైట్స్ ధర ఆకాశానికి తాకింది. ఐపీఎల్ ఐదేళ్ల మీడియా రైట్స్ వల్ల బీసీసీఐ ఖజానాలో రూ. 48, 390 కోట్లు చేరాయి. 2018-2022కు గానూ ఐపీఎల్ మీడియా రైట్స్ ను కేవలం 16,347 కోట్లకే డిస్సీ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ ధర మూడింతలు కావడం ఐపీఎల్ క్రేజ్ ను చెప్పకనే చెబుతున్నాయి.
గతంలో లాగా ఐపీఎల్ మీడియా రైట్స్ ను ఒకే ప్యాకేజీ కింద బీసీసీఐ విక్రయించలేదు. ఈసారి మీడియా రైట్స్ ను నాలుగు విభాగాలుగా విభజించారు. గ్రూప్ ’ఎ‘ ’బి‘ ’సి‘ ’డి‘లుగా విభజించింది. ’ఎ‘ విభాగంలో టీవీ రైట్స్ ను మాత్రమే ఉంచిన బీసీసీఐ.. గ్రూప్ ’బి‘లో డిజిటల్ రైట్స్ ను ’సి‘లో ఎక్స్ క్లూజివ్ రైట్స్ ను ( ఆరంభ పోరు, ప్లే ఆఫ్స్ తో కలిపి మొత్తం18 మ్యాచ్ లు మాత్రమే), గ్రూప్ ’డి‘లో ఉపఖండం ఆవల మ్యాచ్ లను ప్రసారం చేసే రైట్స్ ను ఉంచింది.
ఒక టీవీ రైట్స్ కోసం సోనీ గ్రూప్, డిస్నీ స్టార్ మధ్య పోటీ తీవ్రంగా నడిచింది. అయితే చివరకు డిస్నీ స్టార్ రూ. 23, 575 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక డిజిటల్ రైట్స్ ను రిలయన్స్ కు చెందిన వయాకమ్ 20 వేల 500 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషం. దాంతో వచ్చే సీజన్ నుంచి మనం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఐపీఎల్ మ్యాచ్ లను చూసే అవకాశం లేదు.