ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఉన్న పేరు అండర్ డాగ్స్! స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా.. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగినా.. ఆఖర్లో చతికలబడటం ఆ జట్టు ఆనవాయితీ..! అంచనాలే లేనప్పుడు ధీటుగా పోటీ ఇవ్వడం.. కీలక సమయంలో చేతులు ఎత్తేయడం ఆ టీమ్ నైజం.! ఈ కారణంగానే గత 15 సీజన్లలో ఒక్కసారి కూడా పంజాబ్ టైటిల్ గెలవలేకపోయింది.
ఆటగాళ్లు మారినా, కెప్టెన్లు, కోచ్‌లు మళ్లీ మళ్లీ మారినా... టీమ్ జెర్సీ రూపురేఖలు మార్చినా ఆ జట్టు రాత మాత్రం మారలేదు. అప్పుడప్పుడు కొన్ని వ్యక్తిగత ప్రదర్శనల మెరుపులు తప్ప ఒక జట్టుగా పంజాబ్ పెద్దగా ఫలితాలు సాధించలేకపోయింది. ఐపీఎల్ 2022 సీజన్ లో మయాంక్ సారథ్యంలో కూడా పంజాబ్ కింగ్స్ తుస్సుమన్పించింది
గతేడాది ధావన్‌ను కెప్టెన్‌గా చేయాలని భావించినా.. చివరకు మయాంక్‌కే అవకాశం ఇచ్చింది యాజమాన్యం. తాజాగా వచ్చే సీజన్‌కు ధావన్‌ను కెప్టెన్‌గా నియమించాలని బోర్డు నిర్ణయించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మెగా వేలంలో ధావన్‌ను రూ.8.25కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. 14 మ్యాచ్‌లు ఆడిన ధావన్ 38.33 సగటు, 122.66 స్ట్రయిక్ రేట్‌తో 460 పరుగులు చేశాడు.
ధావన్ ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్నాడు. అయితే భారత్ తరపున వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు. ఇటీవలే వన్డేల్లో భారత్ బీ టీమ్‌కు ధావన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నెలాఖరులో న్యూజిలాండ్‌లో జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కూడా ధావన్ కెప్టెన్‌గా పని చేశాడు.