ఘోర రోడ్డు ప్రమాదంతో ఆటకు దూరమైన రిషభ్ పంత్ కు అరుదైన గౌరవం ఇవ్వాలని ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయం తీసుకుంది. పంత్ జెర్సీ నెంబర్ (17)తో ఐపీఎల్ 2023 సీజన్ బరిలోకి దిగాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ధ్రువీకరించాడు. తమ జట్టు రిషభ్ పంత్‌ను ఎంతో మిస్సవుతుందని చెప్పిన పాంటింగ్.. అతని జెర్సీ నెంబర్‌ను మా టీషర్టులుపై లేదా క్యాప్‌లపై ముద్రించుకోవాలనుకుంటున్నామని తెలిపాడు.
తాము రిషభ్ పంత్‌ను చాలా మిస్ అవుతున్నాం అని పేర్కొన్న పాంటింగ్.. ప్రతీ మ్యాచ్‌కు పంత్ డగౌట్లో తన పక్కన కూర్చోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే తమకు అనుకూలంగా ఉన్న మార్గాల్లో అతన్ని జట్టులో భాగం చేయాలనుకుంటున్నామని పేర్కొన్నాడు. ఇందులో భాగంగానే అతని జెర్సీ నెంబర్‌ను తమ టీషర్టులపై లేదా క్యాప్‌లపై ముద్రించుకోవాలని నిర్ణయించుకున్నట్లు పాంటింగ్ తెలిపాడు.
గాయంతో జట్టుకు దూరమైన పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్ ను కెప్టెన్ గా నియమించే అవకాశం ఉంది. అయితే దీనిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇక పంత్ స్థానంలో కేరళ వికెట్ కీపర్ అజారుద్దీన్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గాయంతో ఇరానీ కప్ కు దూరంగా ఉన్న సర్ఫరాజ్ ఖాన్ జట్టుతో కలిశాడు.
ప్రస్తుతం అతను ఇంటి దగ్గరే ఉంటూ.. గాయాల నుంచి కోలుకుంటున్నాడు. గాయాల తీవ్రత కారణంగా అతను సుమారు రెండేళ్ల పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఐపీఎల్ 2023 సీజన్ ఆడకపోయినా.. డగౌట్లో భాగం కావాలని ఢిల్లీ క్యాపిటల్స్ రిషభ్ పంత్ కోరుతోంది. అయితే అతను బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. వారు అనుమతిస్తే ఢిల్లీ ఫ్రాంచైజీ మ్యాచ్‌లకు హాజరయ్యే అవకాశాలున్నాయి.