ఎటువంటి అంచనాలు లేకుండా గతేడాది ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ ఏకంగా చాంపియన్ గా అవతరించింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి ప్లేయర్ల ఆట తోవడవ్వడంతో 2022 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు ఎదురేలేకుండా పోయింది. ఈ ఏడాది డిఫెండింగ్ చాంపియన్ గా అడుగుపెడుతున్న గుజరాత్ టైటాన్స్ మరోసారి చాంపియన్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత సీజన్ కు ఈ సీజన్ కు జట్టులో పెద్దగా మార్పులు లేవు. హార్దిక్ తో పాటు శుబ్ మన్ గిల్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, షమీ, రషీద్ ఖాన్ ల రూపంలో గుజరాత్ టైటాన్స్ చాలా బలంగా కనిపిస్తుంది. ఐర్లాండ్ బౌలర్ జాష్ లిటిల్ జట్టులో ఉండటం గుజరాత్ కు సానుకూల అంశం. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ టైటిల్ ను రెండోసారి ముద్దాడే అవకాశం ఉంది.
2022 సీజన్ ముంబై ఇండియన్స్ కు పీడకల లాంటిది. కీలక ప్లేయర్లను కోల్పోయిన తర్వాత కొత్త జట్టుతో ముంబై ఆశించిన స్థాయిలో రాణించలేదు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అయితే ఈసారి మాత్రం ముంబై మరోసారి చాంపియన్ ఆటను ప్రదర్శించే అవకాశం ఉంది. బుమ్రా లేకపోయినా జోఫ్రా ఆర్చర్ రూపంలో జట్టులో నాణ్యమైన బౌలర్ ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, గ్రీన్ ల రూపంలో జట్టులో పవర్ హిట్టర్లకు కొదవలేదు. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ ను ఆరోసారి నెగ్గే అవకాశం ఉంది.
గత సీజన్ లో త్రుటిలో టైటిల్ ను చేజార్చుకున్న రాజస్తాన్ రాయల్స్.. ఈసారి ఐపీఎల్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. గుజరాత్ టైటాన్స్ మాదిరే జట్టులో పెద్దగా మార్పులు చేయలేదు. సంజూ సామ్సన్ కెప్టెన్సీలోని రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది. సంజూ సామ్సన్, జాస్ బట్లర్, దేవ్ దత్ పడిక్కల్, యశస్వీ జైస్వాల్ లతో బ్యాటింగ్ బలంగా ఉంది. బౌల్ట్, అశ్విన్, చహల్ ల రూపంలో బౌలింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో రాజస్తాన్ కు ఐపీఎల్ 16వ సీజన్ గెలిచే సత్తా ఉంది.
ఇక ఈ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ డార్క్ హార్స్ గా బరిలోకి దిగుతోంది. గత సీజన్ లో 8వ స్థానంలో నిలిచింది. అనంతరం జట్టును పూర్తిగా మార్చేసింది. యువ ప్లేయర్ ఎయిడెన్ మార్క్రమ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది. వేలంలో మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, క్లాసెన్, ఆదిల్ రషీద్ లాంటి ప్లేయర్లను కొనుగోలు చేసింది.