ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్ రూ. 18.50 కోట్లతో ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా రికార్డుకెక్కాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్ టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించి ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నీ’గా, ఫైనల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన సామ్ కరన్ ఏకంగా రూ.18.5 కోట్లు కొల్లగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం.
ఇక, ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరూన్ గ్రీన్ ను రూ. 17.50 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఆల్ రౌండర్ అయిన ఈ ఆటగాడి కోసం కూడా వేలంలో భారీగానే పోటీ జరిగింది. భారీ షాట్లతో ఈజీగా క్షణాల్లో ఆట స్వరూపాన్నే మార్చగలడు. ఈ ఏడాది టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్ లో గ్రీన్ మెరుపులు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పొందిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర కలిగిన క్రిస్ మోరిస్ (రూ.16.25 కోట్లు)ను ఒకేరోజు ముగ్గురు అందుకోవడం విశేషం. సామ్ కర్రన్, గ్రీన్, స్టోక్స్ దెబ్బకి క్రిస్ మోరిస్ అత్యధిక ధర అందుకున్న ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి పడిపోయాడు. క్రిస్ మోరిస్ ను రూ.16.25 కోట్లతో రాజస్తాన్ రాయల్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
నికోలస్ పూరన్ : విండీస్ పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ శుక్రవారం జరిగిన మినీ వేలంలో మరోసారి తన సత్తా చాటి అత్యధిక ధరకు అమ్ముడయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ రూ. 16 కోట్లకు పూరన్‌ను దక్కించుకుంది. తద్వారా అతడు ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ళ జాబితాలో యువీతో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు.