ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కు ఓపెనర్ లోటు ఉంది. తొలి సీజన్ లో ఒక ఓపెనర్ గా శుబ్ మన్ గిల్ సక్సెస్ అయినా.. మరో ఓపెనర్ గా ఎవరూ క్లిక్ కాలేదు. మ్యాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహాలను ప్రయత్నించినా పెద్దగా క్లిక్ కాలేదు. దాంతో దీనిని మయాంక్ తో భర్తీ చేయాలనే ఉద్దేశంలో గుజరాత్ ఉన్నట్లు తెలుస్తుంది. మయాంక్ 2022లో విఫలం అయినా.. 2020, 2021 సీజన్లలో పంజాబ్ తరఫున ఓపెనర్ గా అద్భుతంగా రాణించాడు. దాంతోపాటు మయాంక్ కేవలం రూ. కోటి బేస్ ప్రైజ్ లో ఉన్నాడు. ఇతడి కోసం ఇతర ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశాలు చాలా తక్కువ.
ఐర్లాండ్ బౌలర్ జాష్ లిటిల్ కోసం కూడా గుజరాత్ టైటాన్స్ పోటీ పడనుంది. ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టి20 ప్రపంచకప్ లో లిటిల్ సూపర్ అనిపించుకున్నాడు. హ్యాట్రిక్ తో పాటు నిలకడ ప్రదర్శించాడు. ఈ ఏడాది అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా ఉన్నాడు. లిటిల్ రూ. 50 లక్షల బేస్ ప్రైజ్ లో ఉన్నాడు. ఫెర్గూసన్ ను లిటిల్ తో భర్తీ చేసే యోచనలో నెహ్రా ఉన్నాడు.
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ డేవిడ్ మలాన్ పై కూడా గుజరాత్ టైటాన్స్ కన్నేసింది. మలాన్ రూ. 1.5 కోట్ల బేస్ ప్రైజ్ జాబితాలో ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మెగా వేలంలో సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ ను కేవలం రూ. 3 కోట్లకు సొంతం చేసుకున్న గుజరాత్ అతడితో మెరుపులు మెరిపించేలా చేసింది. ప్రస్తుతం కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవ్వాలనే ఉద్దేశంలో హార్దిక్, నెహ్రాలు ఉన్నారు.