ఈ జాబితాలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ స్యామ్ కరణ్ ముందున్నాడు. ఇక ఇటీవలె ముగిసిన టి20 ప్రపంచకప్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన స్యామ్ కరణ్ ను ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదల మీద ధోని టీం ఉంది. టి20 ప్రపంచకప్ లో కరణ్ 13 వికెట్లు తీశాడు. అవసరం అయితే బ్యాట్ తో కూడా మెరుపులు మెరిపించగలడు. గతంలో కరణ్ చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన విషయం తెలిసిందే. అయితే కరణ్ కోసం చెన్నైతో పాటు ఇతర ఫ్రాంచైజీలు కూడా పోటీలో ఉన్నాయి.
దక్షిణాఫ్రికాకు చెందిన రైలీ రోసోను కూడా సొంతం చేసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ యోచిస్తోంది. ప్రస్తుతం అతడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ముఖ్యంగా టి20ల్లో అదరగొడుతున్నాడు. టి20 ప్రపంచకప్ కు ముందు భారత్ తో జరిగిన టి20 సిరీస్ లో రోసో భారీ శతకం బాదిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పొట్టి ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ పై కూడా సెంచరీ బాదాడు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చే రోసో తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగగలడు. ఇతడు జట్టులో ఉంటే మంచిదనే అభిప్రాయంలో ధోని ఉన్నట్లు సమాచారం.