గతేడాది ఐపీఎల్లో ఏమాత్రం అంచనాలు లేకుండా టోర్నీలో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ టైటిల్‌ను ఎగరేసుకునిపోయింది. ఇక మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్లో తొలి మ్యాచ్‌లోనే గుజరాత్ బలమైన చెన్నైను ఢీకొట్టనుంది. అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, 4 సార్లు టోర్నీ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ తొలి మ్యాచ్ జరగనుంది.
ఇక ఈ ఏడాది కూడా గుజరాత్ అదే ఆటతీరును కొనసాగించాలని భావిస్తోంది. IPL 2023 మినీ వేలంలో శివమ్ మావి, కెఎస్ భరత్, కేన్ విలియమ్సన్, జోష్ లిటిల్‌లను కొనుగోలు చేసింది గుజరాత్ యాజమాన్యం. ఈ ఆటగాళ్ల రాకతో టైటాన్స్ జట్టు మరింత పటిష్టంగా మారింది. అలాగే ప్లేయింగ్ ఎలెవన్‌లోనూ పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి.
గుజరాత్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఓపెనర్‌గా, జట్టులో శుభ్‌మాన్ గిల్ ఉన్నాడు. అదే సమయంలో కేన్ విలియమ్సన్ రాకతో టాప్ ఆర్డర్ మరింత పటిష్టం కానుంది. రాహుల్ టేవాటియా, మిల్లర్, హార్దిక్ పాండ్యా ఫినిషర్ పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ శంకర్, అభినవ్ మనోహర్ గత సీజన్లో ఆకట్టుకోలేకపోయారు. బౌలింగ్ విషయానికొస్తే, జట్టులో స్పిన్నర్ రషీద్ ఖాన్ కీ బౌలర్ కానున్నాడు. ఆ తర్వాత సాయి కిషోర్, రాహుల్ టేవాటియా కూడా బంతిని పంచుకోనున్నారు.