IPL ప్రారంభమై... 15 సీజన్లు ముగిసిపోయి.. 16వ సీజన్ వచ్చేసిందంటే నమ్మగలరా? అవును.. ఇవాళ 16వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభమవుతుంది. మొత్తం 10 జట్లు పోటీ పడుతున్నాయి. మొత్తం 58 రోజుల్లో 74 మ్యాచ్‌లు జరుగుతాయి. వీటిలో 18 రోజుల్లో.. రోజుకు రెండేసి మ్యాచ్‌లు ఉన్నాయి. మొత్తం 12 స్టేడియంలలో మ్యాచ్‌లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్.. మే 28న జరుగుతుంది.
సీజన్ ఆరంభ మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. మ్యాచ్ జరిగే అవకాశం లేదంటూ.. గురువారం రాత్రి నుంచి వార్తలు సైతం వస్తున్నాయి. గుజరాత్లో గురువారం సాయంత్ర భారీ వర్షం కురవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదంటూ.. క్రికెట్ అభిమానులను నిరాశపరిచే సమాచారం అందింది. దీంతో తొలి మ్యాచ్ జరగదేమో అనే ఆందోళనలో క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. పైగా మ్యాచ్‌కు ముందు జరిగే ఓపెనింగ్ సెర్మనీ కూడా రద్దు అవుతుందనే ప్రచారం జరుగుతోంది.
గుజరాత్‌లోని అహ్మాదాబాద్‌లో గల నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుంచి ఓపెనింగ్ సెర్మనీ కార్యక్రమాలు జరగనున్నాయి. తమన్నా, రష్మికా మంధాన లాంటి స్టార్లు ఈ ఓపెనింగ్ సెర్మనీ వేడుకల్లో తమ డ్యాన్స్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. లేజర్ లైటింగ్ వెలుగుల్లో ఈ వేడుకలు అట్టహాసంగా నిర్వహించనున్నారు.
తొలి మ్యాచ్‌లో చూస్తే 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టి.. టైటిల్ ఎగరేసుకుపోయిన డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్.. ఈసారి కూడా ఫస్ట్ మ్యాచ్ గెలిచేలా కనిపిస్తోంది. ఆ జట్టు అన్ని రకాలుగా పవర్‌ఫుల్‌గా ఉంది. కెప్టెన్ హార్దిక్ పాండ్య, శుభ్‌మన్ గిల్, కేన్ విలియమ్సన్, కేఎస్ భరత్, రషీద్ ఖాన్, మహమ్మద్ షమి ఆ జట్టుకి బలంగా ఉన్నారు.
ఇప్పటికే 4 సార్లు టైటిల్ నెగ్గిన చెన్నై.. ఈసారి కూడా కప్ గెలవాలనుకుంటోంది. ఆ జట్టులో మహేంద్ర సిగ్ ధోనీ ఎడమ కాలికి గాయం కావడంతో.. కొంత ఆందోళనలో ఉంది. ఇవాళ్టి మ్యాచ్‌లో ధోనీ ఉండకపోవచ్చు అంటున్నారు. అదే జరిగితే.. ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్న ధోనీ లేని ఈ మ్యాచ్.. CSK అభిమానులకు కొంత నిరాశ కలిగించవచ్చు. ధోని లేకపోయినా.. ఆల్‌రౌండర్ స్టోక్స్, డెవాన్ కాన్వె, అంబటి రాయుడు, రుతురాజ్, జడేజా, దీపక్ చాహర్, మొయిన్ అలీ, తీక్షణలతో చెన్నై టీమ్ కూడా సవాల్ విసరనుంది.