అయితే ఆ ఓవర్ మూడో బంతిని మెకాయ్ హై ఫుల్ టాస్ వేశాడు. దాదాపు అది నడుము కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. దాంతో దాన్ని నో బాల్ గా ప్రకటించాలని మైదానంలో ఉన్న కుల్దీప్ యాదవ్, పావెల్ మొదట కోరారు. అదే సమయంలో డగౌట్ లో ఉన్న ఢిల్లీ సారథి రిషభ్ పంత్ కూడా అది నో బాల్ అంటూ సైగ చేశాడు. అయితే అంపైర్లు దానిని నో బాల్ గా ప్రకటించకపోవడంతో పంత్ ఆగ్రహంతో ఊగిపోయాడు. పావెల్, కుల్దీప్ లను డగౌట్ కు వచ్చేయాలంటూ ఆదేశించాడు. (PC : TWITTER)
ఇక తన టీం సహాయక కోచ్ ఆమ్రేను మైదానంలోకి పంపాడు కూడా. అదే సమయంలో లాంగాన్ లో ఫీల్డింగ్ చేస్తోన్న జాస్ బట్లర్ పంత్ దగ్గరకు రావడంతో వాతావరణం మరింతగా హీటెక్కింది. వీరిద్దరు అక్కడే కాసేపు తీవ్రంగా వాదించుకున్నారు. దాంతో మ్యాచ్ చాలా సేపు ఆగిపోయింది. అయితే అంపైర్ మాత్రం దానిని నో బాల్ గా ప్రకటించలేదు. అనంతరం మ్యాచ్ జరగ్గా.. ఆ చివరి మూడు బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే రావడంతో రాజస్తాన్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఐపీఎల్ లో ఇలా జరగడం ఇదేమి తొలిసారి కాదు. గతంలోనూ ఇలానే ఒకసారి జరిగింది. ఆ సమయంలో మిస్టర్ కూల్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతే కాదు.. మైదానంలోకి వెళ్లి అంపైర్లతో గొడవకు కూడా దిగాడు. అప్పుడు కూడా ప్రత్యర్థి జట్టుగా రాజస్తాన్ రాయల్స్ ఉండటం విశేషం.
2019లో రాజస్తాన్ రాయల్స్, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఛేజింగ్ లో చెన్నై విజయం సాధించాలంటూ ఆఖరి ఓవర్లో 18 పరుగులు అవసరం అయ్యాయి. తొలి రెండు బంతులకు 10 పరుగులు రాగా.. మూడో బంతికి ధోని అవుటయ్యాడు. దాంతో చెన్నై గెలుపు సమీకరణం మూడు బంతుల్లో 8 పరుగులుగా మారింది. స్టోక్స్ నాలుగో బంతిని ఫుల్ టాస్ గా వేశాడు. దానిని లాంగాన్ లోకి ఆడిన సాంట్నెర్ రెండు పరుగులు చేశాడు. అయితే ఆ ఫుల్ టాస్ బ్యాటర్ నడుము కంటే ఎక్కువ ఎత్తులో ఉండటంతో నో బాల్ గా ప్రకటించాల్సిందిగా క్రీజులో ఉన్న జడేజా అంపైర్ ను కోరాడు. అందుకు ఫీల్డ్ అంపైర్లు ఒప్పుకోలేదు.
ఇక అప్పుడే డగౌట్ కు చేరిన ధోని.. కోపంతో మైదానంలోకి వచ్చి అంపైర్లతో వాగ్వివాదానికి దిగాడు. స్టోక్స్, రహానే, స్టీవ్ స్మిత్ (రాజస్తాన్ ప్లేయర్స్) ధోనికి నచ్చజెప్పారు. అయితే ఆ మ్యాచ్ లో చెన్నై 4 వికెట్లతో నెగ్గడం విశేషం. ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా.. సాంట్నెర్ సిక్సర్ బాది జట్టుకు విజయాన్ని అందిస్తాడు.