భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ సీజన్ ప్రస్తుతం ముగిసింది. ఇప్పుడు అందరి చూపు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై పడింది. లీగ్ 16వ సీజన్లో గత సీజన్ విజేత గుజరాత్ టైటాన్స్ వైపే అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అందులోనూ సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌పై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ కోసం నిరీక్షణకు తెరపడనుంది. ఈసారి ఐపీఎల్ మార్చి 31వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుత చాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్, నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. గత సీజన్లో తొలిసారిగా టోర్నీలో గుజరాత్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించి విజేతగా నిలిపాడు.
భారత క్రికెట్ జట్టు స్టార్‌గా మారిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గుజరాత్ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. గత సీజన్లో టోర్నీలో అడుగుపెట్టిన కొత్త జట్టు.. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన యువ గిల్‌ని జట్టులోకి తీసుకుంది. ఈ ఓపెనర్ గత సీజన్లో జట్టుకు శుభారంభం అందించి జట్టు చాంపియన్‌గా నిలపడంలో కీ రోల్ ప్లే చేశాడు.
గత కొన్ని నెలలుగా భారత జట్టులో శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ, టీ20ల్లో సెంచరీ, ఆ తర్వాత టెస్టుల్లో ఆస్ట్రేలియాపై సెంచరీలు కూడా చేశాడు. శుభ్‌మన్ గిల్ ప్రస్తుత ఫాం సూపర్ గా ఉంది. గిల్ ను త్వరగా ఔట్ చేయకపోతే.. భారీ ఇన్నింగ్స్ లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు.