టీ20 ఫార్మాట్ ఎంట్రీతో క్రికెట్ (Cricket) ముఖ చిత్రమే మారిపోయింది. అప్పటి వరకు క్లాస్ గా సాగుతున్న క్రికెట్ లోకి ధనాధన్ షాట్లు ఎంట్రీ ఇచ్చాయి. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎంట్రీతో క్రికెట్ పక్కా కమర్షియల్ గా మారిపోయింది. పసందైన ఆటతో అభిమానులను అలరిస్తూనే కాసుల వర్షం కురిపిస్తోన్న ఐపీఎల్.. మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోతుంది.
అయితే టి20 ఫార్మాట్ ను మరింత రంజుగా చేయడానికి బీసీసీఐ (BCCI) నడం బిగించింది. ' ఇంపాక్ట్ ప్లేయర్ (Impact Player)' కాన్సెప్ట్ తో వచ్చే ఐపీఎల్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా చేసేందుకు కసరత్తులు చేస్తుంది. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ను ఇప్పటికే దేశవాళి క్రికెట్ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ (Syed Mushtaq Ali) ట్రోఫీలో ప్రయోగించింది.
ఫుట్ బాల్ తరహాలో ఇక నుంచి ఐపీఎల్ జట్లు కూడా సబ్ స్టిట్యూట్ ఆటగాళ్ల ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవచ్చు. వారితో బౌలింగ్, బ్యాటింగ్ చేయించే వీలుంటుంది. ఈ కొత్త వెసులబాటు ద్వారా, జట్టులోని 11 మందికి తోడు మరో అదనపు ఆటగాడిని కూడా ఆడించినట్టవుతుంది. పేరుకే సబ్ స్టిట్యూట్ అయినా... బ్యాటింగ్, బౌలింగ్ చేస్తాడు కాబట్టి పూర్తిస్థాయి ఆటగాడి కింద లెక్క!
అసలేంటి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ : టాస్ సమయంలో ఇరు జట్లు 11 మందితో తమ తుది జట్లను ప్రకటించడంతో పాటు మరో నలుగురితో ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాను అంపైర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇరు జట్లు కూడా తమ ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితా నుంచి ఒక ప్లేయర్ ను తుది జట్టులోకి తీసుకునే వెసులు బాటు ఉంటుంది. అలా వచ్చిన ప్లేయర్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేసే వీలు ఉంటుంది.
అది కూడా ఇన్నింగ్స్ 14వ ఓవర్ లోపు మార్చాలి. ఇది రెండు ఇన్నింగ్స్ లకు వర్తిస్తుంది. 15 నుంచి 20 ఓవర్ల మధ్య ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ను తీసుకోవడం జరగదు.ఇంపాక్ట్ ప్లేయర్ ను ఉపయోగించేటప్పుడు ఆ విషయాన్ని కెప్టెన్ ఫీల్డ్ అంపైర్ తో గానీ లేక ఫోర్త్ అంపైర్ తో గానీ చెప్పాల్సి ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల వెళ్లిపోయిన ప్లేయర్ మళ్లీ బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉండదు.ఇంపాక్ట్ ప్లేయర్ కు పూర్తి కోటా బౌలింగ్ చేసే అవకాశంతో పాటు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది.