ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) పరిస్థితి మ్యాచ్ మ్యాచుకీ దారుణంగా మారుతోంది. ఆ జట్టు గెలవడమే గగనంగా మారిపోయింది.ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా వరుసగా ఆరో ఓటమిని మూటగట్టుకుంది. ఈ సీజన్లో ఇంకా బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్ ఒక్క విజయం సాధించడం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది.
ఐదుసార్లు ఐపీఎల్లో చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్సేనా ఇప్పుడు ఆడుతుంది అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 2015 ఐపీఎల్ సీజన్లో వరుసగా ఐదు పరాజయాలు నమోదు చేసినప్పటికి.. ఆరో మ్యాచ్‌లో విజయం సాధించి.. ఆ తర్వాత చాంపియన్‌గా నిలిచింది. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. వరుసగా ఆరో మ్యాచులో కూడా విఫలమైంది.
గత సీజన్ వరకు ముంబై జట్టు సమతూకంగా ఉండేది. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లతో దుర్భేద్యంగా ఉండేది. అయితే ఈసారి మాత్రం యువ క్రికెటర్లు ఉండటం, సీనియర్లు ఫామ్‌లో లేకపోవడం కలవరపెడుతోంది. ఇషాన్, సూర్యకుమార్, తిలక్, బ్రెవిస్ వంటి వారు ఆడుతున్నా.. వ్యక్తిగతంగా రోహిత్ భారీగా పరుగులు చేయడం లేదు. ఇక హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్ పరిస్థితి మరీ దారుణం. ఆల్‌రౌండర్ పాత్రను పోషించడంలో తీవ్రంగా విఫలమయ్యాడు.
ఇక, ముంబై బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. బుమ్రాకు బౌలింగ్‌లో సహకారం లేదు. ఈ లోపాల్ని సరిదిద్దుకోవడానికి ముంబై రెడీ అయింది. గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన ఫాస్ట్ బౌలర్ ధవల్ కులకర్ణిని తుది జట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది. జట్టు సారథి రోహిత్ శర్మ సిఫారసు మేరకు.. అతడిని తిరిగి ముంబైలో చేర్చుకోనున్నట్టు తెలుస్తోంది.
ఒకప్పుడు ట్రెంట్ బౌల్ట్, మిచెల్ జాన్సన్, లసిత్ మలింగ లతో కళకళలాడిన ముంబై బౌలింగ్ యూనిట్.. ఇప్పుడు కళావిహీనమైంది. ఒక్క జస్ప్రీత్ బుమ్రా తప్ప మిగతా ఏ బౌలర్ కూడా రాణించడం లేదు. బాసిల్ తంపి, టిమ్ డేవిడ్, టైమల్ మిల్స్ లు ధారాళంగా పరుగులిచ్చుకుంటున్నారు. స్పిన్నర్ మురుగన్ అశ్విన్ కూడా గొప్పగా రాణించింది లేదు.
దీంతో, బౌలింగ్ దళాన్ని పటిష్టం చేసేందుకు జట్టు యాజమాన్యం యోచిస్తున్నది. ఇందులో భాగంగానే కులకర్ణిని తిరిగి జట్టులో చేర్చుకోవాలని చూస్తోంది. గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన కులకర్ణికి ముంబై, పూణే పిచ్ లు ఎలా స్పందిస్తాయనేదానిపై స్పష్టమైన అవగాహన ఉంది. దీంతో ధవల్ కులకర్ణిపైనే రోహిత్ ఆశలన్నీ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ధవల్ కులకర్ణి ఐపీఎల్లో ఇప్పటివరకు 92 మ్యాచ్‌లు ఆడి 86 వికెట్లు పడగొట్టాడు. అతను గతంలో ముంబై ఇండియన్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కులకర్ణి 2020, 21 సీజన్లలో ముంబై ఇండియన్స్ జట్టులోనే ఉన్నాడు. అయితే ఈ ఏడాది మెగావేలంలో అతన్ని తిరిగి దక్కించుకునేందుకు ముంబై యాజమాన్యం ఆసక్తి చూపలేదు. కులకర్ణి టీమిండియా తరఫున 12 వన్డేలు, 2 టీ20లు ఆడి 22 వికెట్లు పడగొట్టాడు.