మరో 3 రోజుల్లోనే క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఐపీఎల్ 2022 (IPL 2022) ప్రారంభం కానుంది. జట్లన్నీ కూడా లీగ్ కోసం సిద్ధమైపోయాయి. ఈ నెల 26న డిఫెండింగ్ చాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ( CSK vs KKR)మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఐపీఎల్ 15 సీజన్‌కు తెరలేవనుంది.
ఇటీవల ఇండియా, శ్రీలంక టెస్టు మ్యాచ్‌కు భారీగా అభిమానులు తరలివచ్చారు. మొహాలీలో 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించగా.. బెంగళూరులో జరిగిన రెండో టెస్టుకు 100 శాతం మందికి అనుమతించారు. ఈ రెండు మ్యాచ్‌లు ప్రేక్షకులతో కళకళలాడాయి. దీంతో, ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ లేదని స్పష్టమవుతోంది.
గత రెండు ఐపీఎల్ సీజన్లపై కరోనా ప్రభావం చూపింది. 2020లో దేశంలో కరోనా తొలి వేవ్ ప్రారంభమైంది. దీంతో ఆ సీజన్ పూర్తిగా యూఏఈలో నిర్వహించింది బీసీసీఐ. 2021 ఐపీఎల్‌ను భారత్‌లోనే ప్రారంభించినా.. పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటం వల్ల.. టోర్నీని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. మిగిలన మ్యాచ్‌లను రెండో విడతలో యూఏఈ వేదికగా నిర్వహించింది.