ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరినీ ఏకం చేసి సహచరుల్ని ప్రత్యర్థుల్లా.. ప్రత్యర్థుల్ని సహచరుల్లా మార్చే ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, టీ20 ఫార్మాట్ లో క్షణాల్లో ఆట స్వరూపమే మారిపోతుంటుంది. ఇలాంటి ధనాధన్ గేమ్ లో కెప్టెన్సీ అనేది కత్తి మీద సాము లాంటిది. అందుకే, కొందరు సారథులు లీగ్ చరిత్రలోనే ది బెస్ట్ గా నిలిచారు.
Cameron White: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కామెరూన్ వైట్.. ఐపీఎల్లో ఆర్సీబీ, దక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2012 సీజన్ మధ్యలో సంగక్కర నుంచి దక్కన్ ఛార్జర్స్ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఏడాది సన్‌రైజర్స్‌కూ కెప్టెన్‌గా చేశాడు. మొత్తంగా 12 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన వైట్.. 7 మ్యాచుల్లో విజయవంతమయ్యాడు. ఇతడి విజయ శాతం 58.33గా ఉంది. ఈ లిస్ట్ లో ఐదో స్థానంలో ఉన్నాడు.
MS Dhoni: ఐపీఎల్ చరిత్రలో 2008 నుంచి ఇప్పటివరకు ఒకే జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతుంది ధోనీ ఒక్కడే. చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న ఇతడు ఇప్పటివరకు నాలుగు సార్లు జట్టుకు ట్రోఫీని అందించాడు. మొత్తంగా 188 మ్యాచులకు సారథ్యం వహించిన ధోనీ.. 110 మ్యాచుల్లో విజయవంతమయ్యాడు. 2016, 2020 తప్ప ప్రతి సీజన్లో ధోనీ చెన్నై జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకువెళ్లాడు. ఇతడి విజయశాతం 58.8గా ఉంది. ఈ లిస్ట్ లో ధోనిది నాలుగో స్థానం.
Sachin Tendulkar: భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా విఫలమైనా సచిన్ టెండూల్కర్ ఐపీఎల్లో మాత్రం తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. ఇతడి సారథ్యంలో ముంబై జట్టు 2010 సీజన్ ఫైనల్ చేరుకుంది. కానీ, ఫైనల్ లో చెన్నై చేతిలో ఓడిపోయింది. మొత్తంగా ఐపీఎల్లో 51 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన సచిన్.. 30 మ్యాచ్‌ల్లో విజయవంతమయ్యాడు. ఇతడి విజయ శాతం 58.82గా ఉంది. ఈ లిస్ట్ లో మూడో స్థానం క్రికెట్ గాడ్ దే.
Steve Smith: టీ20 లీగ్‌లతో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ కెప్టెన్‌గా ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ తన సత్తాను నిరూపించుకున్నాడు. 2017లో పుణె వారియర్స్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న స్టీవ్ స్మిత్.. జట్టును అద్భుతంగా ముందుకు సాగించాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్‌కు కూడా కొన్ని సీజన్లకు సారథిగా వ్యవహరించాడు. మొత్తం 42 మ్యాచులకు కెప్టెన్సీ వహించిన స్మిత్ 25 విజయాల్ని అందించాడు. ఇతడి విజయ శాతం 59.52గా ఉంది. ఈ లిస్ట్ లో రెండో స్థానం స్మిత్ దే.
Rohith Sharma: ముంబై ఇండియన్స్ జట్టుకు 8 ఏళ్లుగా కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ.. టీమ్‌కు ఐదు సార్లు విజయాలను అందించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు 116 ఐపీఎల్ మ్యాచులకు సారథ్యం వహించిన అతడు.. అందులో 70 సార్లు విజయాన్ని అందుకున్నాడు. రోహిత్ సారథ్యంలో 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో కప్‌ను సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్. ఇతడి విజయ శాతం 60.34గా ఉంది. మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ల లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు హిట్ మ్యాన్.