మరో ఆరు రోజుల్లో క్రికెట్ కుంభమేళ ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 26న చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings), కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata knight Riders) జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో ఐపీఎల్ 15వ సీజన్ ఘనంగా ఆరంభం కానుంది. ఇప్పటికే కొన్ని జట్లు ప్రాక్టీస్ క్యాంపుల్ని కూడా మొదలుపెట్టేశాయ్.
అయితే, మెగా టోర్నీ ప్రారంభానికి ముందు ఫ్రాంచైజీలకు ఇప్పుడు ఒక కొత్త తలనొప్పి మొదలైంది. గాయాల బెడదతో ప్రతి జట్టు టెన్షన్ పడుతున్నాయ్. ఇప్పటికే చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఆయా జట్లకు దూరం కాగా, మరి కొందరు క్రికెటర్ల అందుబాటుపై సందిగ్థత నెలకొంది. కానీ, చెన్నై పరిస్థితి గందోరగోళంగా మారింది. ఆ స్టార్ ఆటగాడు ఫిట్ గా ఉన్న ఇంకా జట్టుతో చేరలేదు.
ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. " మొయిన్ ఫిబ్రవరి 28న వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు చేసి 20 రోజులైంది. అతను నిరంతరం భారతదేశానికి వస్తూ ఉంటాడు కానీ అతనికి ఇంకా వీసా లభించలేదు. కారణం ఏంటో తెలియదు. త్వరలో జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నాము. ఈ విషయంలో బీసీసీఐ తన వంతుగా ప్రయత్నాలు చేస్తోంది. సోమవారం నాటికి ఈ సమస్య పరిష్కారమవుతుందని " చెప్పాడు.