వయసు చిన్నదైనా పరిణతి ఉన్న ఆటగాడిగా అతను కనబరుస్తున్న ప్రదర్శన గమనించదగ్గది. బౌండరీలు బాదడంలోనూ తిలక్ మంచి దిట్ట. ముఖ్యంగా తిలక్‌లో నచ్చేదేంటంటే.. పోరాటం. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు బౌలర్లు తమ పదునైన తెలివైన బంతులతో బురిడి కొట్టించాలని చూస్తున్నా చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మిస్తూ పోరాడుతుంటాడు.
తిలక్ వర్మ క్రికెట్ కెరీర్ టెన్నిస్ బాల్ తో మొదలైంది. ఆ సమయంలో తిలక్ వర్మ బ్యాటింగ్ ను చూసిన అతడి కోచ్... తిలక్ వర్మ బ్యాటింగ్ పై ముచ్చట పడ్డాడు. బంతిని మిడిల్ చేయడంలో తిలక్ వర్మ సూపర్ సక్సెస్ అవుతుండటం... చక్కటి షాట్లు ఆడటం కోచ్ ను ఇంప్రెస్ చేశాయి. వెంటనే అతడు తిలక్ వర్మ వాళ్ల పేరెంట్స్ తో మాట్లాడాడు. తిలక్ వర్మలో గొప్ప క్రికెటర్ ఉన్నాడని కోచింగ్ ఇప్పిస్తే మంచి క్రికెటర్ గా ఎదిగే అవకాశం ఉందని కోచ్ తిలక్ వర్మ పేరెంట్స్ కు చెప్పాడు.
అందుకు తిలక్ వర్మ పేరెంట్స్ ఒప్పుకోవడంతో అతడు కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాడు. అయితే తిలక్ వర్మ కుటుంబం ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉంది. దాంతో తిలక్ వర్మ కోచే బ్యాట్, ప్యాడ్స్ తో పాటు క్రికెట్ కు అవసరమైన వాటిని ఏర్పాటు చేశాడు. అండర్ 14 క్రికెట్ ఆడుతున్నపుడు తిలక్ వర్మ దగ్గర ఒకే ఒక్క బ్యాట్ ఉండేది. అది మెల్లగా విరిగిపోవడం మొదలైంది. అప్పుడు టేప్‌తో అతికించి దానిని వాడుకునేవాడిని.
అయితే పట్టుదలతో క్రికెట్ ను ప్రాక్టీస్ చేసిన తిలక్ వర్మ తక్కువ సమయంలోనే తనను తాను నిరూపించుకున్నాడు. 19 ఏళ్ల తిలక్ వర్మ లిస్ట్ ఏ కెరీర్లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు 16 మ్యాచ్‌ల్లో 784 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 156 నాటౌట్ ఇతడికి అత్యధికం. ఇదే ఫామ్ ను భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తే టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా తిలక్ ఎదగడం ఖాయమంటున్నారు క్రీడా నిపుణులు.