క్రికెట్ (Cricket) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఐపీఎల్ 2022కి (IPL 2022) సంబంధించిన ప్లేయర్స్ రిటెన్షన్స్ (Player Retentions) పూర్తైంది. అన్ని ఫ్రాంచైజీలు రిటెన్షల్లపై తీవ్రమైన కసరత్తు చేసినట్లే కనబడుతోంది. సీనియర్ ప్లేయర్లకే దాదాపు ఫ్రాంచైజీలన్నీ పెద్దపీఠ వేశాయి. అదే సమయంలో కొంత మంది యువ ప్లేయర్లు, అన్క్యాప్డ్ ప్లేయర్లు కూడా లక్కీ చాన్స్ కొట్టేశారు. ఐపీఎల్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను వారి ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోగా.. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ వార్నర్, రషీధ్ ఖాన్ , శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్లతో పాటు కీలక ప్లేయర్లను ఆయా ఫ్రాంచైజీలు విడుదల చేశాయి.
అయితే, మెగా వేలానికే ముందే ఫ్రాంచైజీలు కొందరు ప్లేయర్లపై కోట్ల వర్షం కురిపించాయి. టీమ్‌కు నలుగురికి చొప్పున 32 మందికి అవకాశం ఉన్నప్పటికీ ఎనిమిది టీమ్స్ కలిపి 27 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. ఇక, జనవరిలో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) కోసం ఫ్రాంచైజీలు భారీగానే పోటీపడే అవకాశం ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్‌ను విజయవంతంగా నడిపించిన శ్రేయాస్ అయ్యర్.. 2020 ఐపీఎల్లో జట్టును ఫైనల్ చేర్చాడు. అయితే ఆ సీజన్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఇక అయ్యర్ గాయంతో ఐపీఎల్ 2021 సీజన్ తొలి అంచె పోటీలకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతని స్థానంలో ఢిల్లీ మేనేజ్మెంట్ రిషబ్ పంత్‌కు నాయకత్వం బాధ్యతలు అప్పగించింది.
తాజాగా మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయాస్ అయ్యర్‌ను రిటైన్ చేసుకోలేదు. ఆటగాడిగా తాను ఇంకా సాధించాల్సింది చాలా ఉందని.. అందుకే రిటైన్ చేసుకోలేదని ఢిల్లీ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 2375 పరుగులు చేసిన అయ్యర్‌పై ఐదు ఫ్రాంచైజీలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. వాటిలో అహ్మదాబాద్, లక్నోతో పాటు ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఉన్నాయి.
ఆర్సీబీ : ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ కూడా శ్రేయాస్ అయ్యర్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. కోహ్లి, మ్యాక్స్‌వెల్, సిరాజ్‌లను మాత్రమే రిటైన్ చేసుకున్న ఆర్సీబీ శ్రేయాస్ అయ్యర్ కోసం భారీగానే వెచ్చించనున్నట్లు సమాచారం. అయ్యర్ కోసం పోటీ పడడంపై పరోక్షంగా కోహ్లి సలహా కూడా ఒక కారణమని తెలిసింది. పైగా మ్యాక్స్‌వెల్‌ను కెప్టెన్ చేయకుంటే.. అయ్యర్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ముంబై ఇండియన్స్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు శ్రేయాస్ అయ్యర్‌పై చాలా నమ్మకం. ఆ నమ్మకంతోనే అతన్ని జట్టులోకి తీసుకురావాలనే ప్రయత్నాన్ని పరోక్షంగా చేయనున్నాడు. అసలే రిచ్ టీమ్‌గా పేరున్న ముంబై అయ్యర్కోసం ఎంత ధర అయినా వెచ్చించే అవకాశం ఉంది. పైగా ఇషాన్ కిషన్ ను వదులుకున్న ముంబైకి ఒక నిఖార్సైన బ్యాటర్ అవసరం. ఆ లక్షణాలు అయ్యర్‌లో పుష్కలంగా ఉండడంతో అతన్ని దక్కించుకోవడానికి పోటీ పడడం ఖాయం.
పంజాబ్ కింగ్స్ : ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే.. కేఎల్ రాహుల్‌ను పంజాబ్ వదులుకోవడంతో ఆ జట్టుకు ఇప్పుడు కొత్త కెప్టెన్ అవసరం చాలా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను విజయవంతంగా నడిపించిన రికార్డు ఉండడంతో అతన్ని దక్కించుకోవడం కోసం పంజాబ్ కచ్చితంగా ప్రయత్నిస్తోంది. ఇక అయ్యర్ పంజాబ్‌కు ఎంపికైతే మాత్రం కచ్చితంగా కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాయంక్ అగర్వాల్‌ను భారీ ధరకు రిటైన్ చేసుకున్న పంజాబ్.. అతనికి అండగా అయ్యర్‌ను జట్టులోకి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉంది.
అహ్మదాబాద్, లక్నో ఫ్రాంచైజీలు: ఈ రెండు కొత్త ఫ్రాంచైజీలు కావడం.. అయ్యర్‌కు సానుకూలాంశంగా మారింది. ఇప్పటికే లక్నోకు కేఎల్ రాహుల్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉండడంతో బ్యాటింగ్ బలోపేతం చేయడానికి అయ్యర్ లాంటి ఆటగాడి అవసరం ఉండడంతో లక్నో ఫ్రాంచైజీ అయ్యర్‌పై భారీగా వెచ్చించే అవకాశం ఉంది. మరోవైపు అహ్మదాబాద్ కూడా అయ్యర్ కోసం పోటీపడే అవకాశం ఉంది. వీలైతే అహ్మదాబాద్‌కు కెప్టెన్ చేసే అవకాశం కూడా ఉంది.