విరాట్ కోహ్లీ (Virat Kohli).. రికార్డుల రారాజు. ఒకప్పుడు ఇతడు ఆడిన తీరును చూస్తే సచిన్ రికార్డులు గల్లంతవ్వడానికి ఎంతో సమయం పట్టదనిపించేది. మైదానంలోకి అడుగు పెడితే సెంచరీ చేసే వరకు లేదా జట్టును గెలిపించే వరకు అవుటవ్వను అన్న రీతిలో కోహ్లీ బ్యాటింగ్ సాగేది. కోహ్లీని అవుట్ చేయడానికి మా దగ్గర వ్యూహాలు లేవంటూ పలువరు కెప్టెన్లు భావించేవారంటే అతిశయోక్తి కాదు.
ఇక ఛేజింగ్ ల్లో కోహ్లీ కి ఘనమైన రికార్డులే ఉన్నాయి. కొండంత లక్ష్యం ముందున్నా.. ప్రత్యర్థి బౌలర్లు సవాల్ విసురుతున్నా.. విరాట్ కోహ్లీ ఇసుమంత ఒత్తిడికి గురైన దాఖలాలు లేవు. కోహ్లీ మాటల్లో చెప్పాలంటే.. అతనికి సవాళ్లంటే ఇష్టం. కానీ.. ఇదంతా ఒకప్పుడు. 2019 నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడున్న కోహ్లీ ఫామ్ లేకుండా నానా తంటాలు పడుతున్నారు.
ఈ క్రమంలో మరోసారి నిరాశపర్చాడు కోహ్లీ. ఐపీఎల్ 2022 సీజన్ లో విరాట్ కోహ్లీ చెత్త ప్రదర్శన కంటిన్యూ అవుతోంది. అలాంటి, ఇలాంటి చెత్త ప్రదర్శన కాదు. మరోసారి.. గోల్డెన్ డకౌటయ్యాడు. లేటెస్ట్ గా సన్ రైజర్స్ తో జరుగుతున్న మ్యాచులో విరాట్ కోహ్లీ ఫస్ట్ బంతికే సుచిత్ బౌలింగ్ లో కేన్ విలియమ్సన్ కి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌటయ్యాడు.
ఇంతలా కోహ్లీ విఫలం కావడానికి కారణం ఏంటి? అనేది అటు క్రికెట్ పండితులకు ఇటు క్రికెట్ ఫ్యాన్స్ కు అర్థం కావడం లేదు. గతంలోలాగా టీమిండియాలో విరాట్ ఆడిందే ఆటగా సాగే రోజులు కావు ఇవి. ప్రస్తుతానికి అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫామ్ లోకి వస్తే బాగుంటుంది. లేదంటే.. కోహ్లీపై వేటు తప్పకపోవచ్చని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.