మరి కొద్ది రోజుల్లో క్రికెట్కుంభమేళ ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 26న చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings), కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata knight Riders) జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో ఐపీఎల్ 15వ సీజన్ ఘనంగా ఆరంభం కానుంది. ఇప్పటికే కొన్ని జట్లు ప్రాక్టీస్ క్యాంపుల్ని కూడా మొదలుపెట్టేశాయ్. ఈ సారి ఐపీఎల్‌లోకి కొత్తగా రెండు జట్లు ప్రవేశించాయి. దీంతో మరోసారి జట్ల బలబలాలు... ఆటగాళ్ల రికార్డుల లెక్కలు మొదలయ్యాయ్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. 2016 లో ఐపీఎల్లో కోహ్లీ మొత్తం సీజన్లో బ్యాటింగ్‌తో 973 పరుగులు చేశాడు. కోహ్లీ చేసిన ఈ ఘనతను ఇంత వరకు ఏ బ్యాట్స్ మన్ కూడా అందుకోలేకపోయాడు. గత నాలుగు సీజన్లలో ఈ రికార్డు దరిదాపుల్లోకి ఎవ్వరూ రాలేకపోయారు. ఈ సారి ఐపీఎల్ లో అయినా ఈ రికార్డు బద్దలు అవుతుందో లేదో వేచి చూడాలి.