ఫిబ్రవరిలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) మెగా వేలంలో సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) ను రూ. 30 లక్షలకు ముంబై ఇండియన్స్ మరోసారి కొనుగోలు చేసింది. ఇక సీజన్ లో ముంబై ఆటతీరు పేలవంగా సాగగా.. తుది జట్టు విషయంలో ముంబై మ్యాచ్ మ్యాచ్ కు మార్పులు చేసింది. దాంతో అర్జున్ కు తుది జట్టులో అవకాశం దక్కుతుందేమోనని అంతా భావించారు.
అర్జున్ గత 2 సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్‌తో ఉన్నాడు, కానీ ఇప్పటికీ అతని IPL అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై ప్రదర్శన నిరాశపరిచిందని, అందుకే ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించిన తర్వాత యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. రోహిత్ ప్రకటన తర్వాత అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేస్తాడని భావించారు, కానీ ముంబై అర్జున్ను బెంచ్‌లో ఉంచింది. దీంతో.. సచిన్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశపడ్డారు.
అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై పలువురు మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై మెంటర్, అర్జున్ తండ్రి సచిన్ టెండూల్కర్ ఇప్పుడు ఈ విషయంపై స్పందించారు. తాను జట్టు ఎంపికలో జోక్యం చేసుకోనని చెప్పాడు. ' నేను ఎప్పుడూ టీం ఎంపికలో పాల్గొనను. ఇప్పుడు ఇలానే ప్రవర్తిస్తాను. ఆటగాళ్లకు సలహాలు మాత్రమే ఇస్తాను' అని సచిన్ చెప్పుకొచ్చాడు.
ఇక తాజాగా అర్జున్ టెండూల్కర్ కు మరోసారి గట్టి షాక్ తగిలింది. జూన్ లో జరిగే రంజీ ట్రోఫీ నాకౌట్ పోటీల కోసం ప్రకటించిన ముంబై జట్టు నుంచి అర్జున్ ను తొలగించేసింది. వాస్తవానికి ఫిబ్రవరిలో జరిగిన రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్ ల కోసం ముంబై రంజీ టీంలో అర్జున్ టెండూల్కర్ చోటు దక్కించుకున్నాడు. అయితే తాజాగా ప్రకటించిన టీంలో మాత్రం అర్జున్ తన స్థానాన్ని కాపాడుకోలేకపోయాడు.