ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) చెత్త ఫామ్ తో అందరి చేత విమర్శలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ పరుగుల కోసం నానా కష్టాలు పడ్డాడు. ఐపీఎల్ తొలి ఎడిషన్ 2008లో కేవలం 165 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.. 2009లో 246 పరుగులు చేశాడు.
ఇక అప్పటి నుంచి ప్రతి సీజన్ లోనూ 300లకు పైగానే పరుగులు చేస్తూ వచ్చాడు. ఇక, గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ కు ముందు 2022 సీజన్ లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 13 మ్యాచ్ ల్లో కేవలం 236 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో.. ఈ సారి కూడా చెత్త రికార్డు మూట గట్టుకోవడం ఖాయం అనుకుంటున్న వేళ తిరిగి తన సత్తా ఏంటో చూపాడు.
ఈ సీజన్ లో పేలవ బ్యాటింగ్‌తో సతమతమైన కింగ్.. ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో విరాట్(54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విరాట్ మరోసారి ఛేజింగ్ కింగ్ గా నిలిచాడు.
ఈ విక్టరీతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్లే ఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. ముంబై వర్సెస్ ఢిల్లీ మధ్య జరిగే పోరు ద్వారా ఆర్సీబీ ప్లే ఆఫ్ బెర్త్ పై క్లారిటీ రానుంది. ఈ మ్యాచులో ఢిల్లీ గెలిస్తే ఆర్సీబీ తట్టా బుట్టా సర్దుకోవడమే. ఒకవేళ ముంబై గెలిస్తే ఆర్సీబీ రాయల్ గా ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకుంటోంది.
ఇక్కడే విరాట్ కోహ్లీ కొత్త కష్టాలు మొదలయ్యాయ్. ఐపీఎల్ చరిత్రలో 15 సీజన్లుగా ఒకే ఫ్రాంఛైజీ తరుపున ఒకే ఒక్క ప్లేయర్ విరాట్ కోహ్లీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఎంట్రీ ఇచ్చిన విరాట్, 15 సీజన్లుగా అదే టీమ్ తరుపున ఆడుతున్నాడు. 9 సీజన్లలో కెప్టెన్‌గానూ చేశాడు. 2016 సీజన్లో ఫైనల్ చేర్చడం తప్ప టైటిల్ అందించలేకపోయాడు.
విరాట్ కెప్టెన్సీ తప్పుకోగానే ఆర్సీబీ టైటిల్ గెలిస్తే, కోహ్లీపై విమర్శలు రావడం ఖాయం. కోహ్లీ వల్లే ఇన్నాళ్లు ఆర్సీబీ కప్పు నెగ్గలేదన్న ట్రోల్స్ రావడం పక్కా. ముందే కోహ్లీ కెప్టెన్సీ వదులుకుని ఉంటే జట్టు ఎప్పుడో టైటిల్ గెలిచేదని ట్రోల్ చేసేవాళ్లు లక్షల్లో ఉంటారు. ఒకవేళ ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టకపోతే.. కోహ్లీ చెత్త బ్యాటింగ్ వల్లే ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ కి వెళ్లలేదని మరికొందరు ట్రోల్ చేసే అవకాశం ఉంది. దీంతో.. కోహ్లీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.