ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2022 సీజన్ ప్లే ఆఫ్స్ కథ తారా స్థాయికి చేరుకుంది. 10 జట్లతో ఆరంభమైన ఐపీఎల్ 2022 ఊహకందని ట్విస్ట్ లతో దూసుకెళ్తోంది. లీగ్ దశలో ఇంకో మూడు మ్యాచ్ లే మిగిలి ఉండగా.. తాజాగా ఆర్సీబీ (RCB) విక్టరీతో పంజాబ్ (Punjab Kings), హైదరాబాద్ (Sunrisers Hyderabad) అధికారికంగా ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించాయ్. దీంతో.. కోల్ కతా, ముంబై, చెన్నైల సరసన ఈ రెండు జట్లు కూడా చేరాయ్.
తమ చివరి మ్యాచ్‌ను గెలుచుకోవడం ద్వారా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది ఆర్సీబీ. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్‌కు ఉన్న అడ్డంకి ఒకే ఒక జట్టు.. ఆ టీమే ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals). ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఈ రిషభ్ పంత టీమ్.. ఇంకో మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. ముంబై ఇండియన్స్‌తో తలపడాల్సి ఉంది. రాయల్ ఛాలెంజర్స్- ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలవాల్సి ఉంటుంది. దీంతో.. ముంబై గెలవాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ సీజన్ లో అత్యంత చెత్త ప్రదర్శన చేసింది రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్. 13 మ్యాచ్ లాడి మూడే గెలిచింది. ఐదుసార్లు టైటిల్ విజేత అయిన ముంబైకి లీగ్ లో ఎన్నడూ ఇలాంటి చెత్త ప్రదర్శన కనబర్చలేదు. జట్టు ఎంపికలో లోపాలు ఆటగాళ్ల ఫామ్ దీనికి కారణం. ఇదంతా సహజమే అనుకున్నా.. ఇప్పుడు ఆ జట్టు ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బకొట్టే స్థితిలో ఉంది.
ఆర్సీబీ 14 మ్యాచ్ ల్లో ఎనిమిది గెలిచింది. గురువారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచులో విజయాన్ని దక్కించుకుని ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. 16 పాయింట్లతో టేబుల్లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఇదే సమయంలో ఇప్పటికే 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబై చేతిలో ఓడాలి. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ గెలవాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక, వరుస పరాజయాలతో డీలా పడిన ముంబై.. రాబోయే మ్యాచ్ లో మార్పులు చేస్తామంటోంది. ప్లే ఆఫ్స్ కు దూరమైన నేపథ్యంలో చెన్నైతో జరిగిన మ్యాచ్ నుంచి ప్రయోగాలు చేపట్టిన ముంబై.. పొలార్డ్ ను తప్పించింది. ఆరెంజ్ ఆర్మీతో జరిగిన మ్యాచ్‌లో రెగ్యూలర్ స్పిన్నర్లు ఇద్దరిని పక్కనపెట్టి సంజయ్ యాదవ్, మయాంక్ మార్కెండేలను ఆడించింది. ఈ ఇద్దరు పెద్దగా ప్రభావం చూపకపోగా.. చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేసేవారు లేక సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో 3 పరుగులతో ఓటమిపాలైంది.
ఇది ఢిల్లీ క్యాపిటల్స్ కు మంచి ఛాన్స్. ముంబైని ఓడించడమే కాకుండా భారీ విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో మెరుగైన స్థానంలో నిలిచే అవకాశం ఆ జట్టుకు కలుగుతోంది. దీంతో.. ఆర్సీబీ ఫ్యాన్స్.. రోహిత్.. ఈ టైంలో మార్పులు అవసరమా.. కోహ్లీ మీద నీకస్సలు దయ లేదా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. నీ పగని తర్వాత తీర్చుకో అంటున్నారు.