ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) పరిస్థితి దారుణంగా తయారైంది. ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ జట్లుగా పేరున్న ఈ రెండూ ఈ సీజన్లో ఘోరంగా విఫలం అయ్యాయి. ఈ రెండు టీమ్స్ కలిసి తొమ్మిదిసార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ టైటిల్‌ను ఎగరేసుకెళ్లాయి. ఇందులో ముంబై ఇండియన్స్ వాటా.. అయిదు. చెన్నై వాటా నాలుగు. కానీ, ఈ సారి ఈ రెండు జట్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది.
ముంబై ఇండియన్స్‌తో పోల్చుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి కొంతలో కొంత బెటర్. 11 మ్యాచ్ల్లలో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగింట్లో విజయాలను అందుకోగా.. అదే 11 మ్యాచ్‌లను ఆడిన ముంబై ఇండియన్స్ గెలిచింది రెండే. ఈ రెండు టీమ్స్ ప్లేఆఫ్స్‌కు చేరుతాయనే ఆశల్లేవు గానీ.. ప్రత్యర్థుల అవకాశాలను మాత్రం దెబ్బకొట్టడం ఖాయం.
అయితే, ఈ సీజన్ ప్రారంభంలో చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కెప్టెన్సీలో కొన్ని మ్యాచ్‌లను ఆడిన విషయం తెలిసిందే. కెప్టెన్సీ మార్పు వ్యవహారమే ఆ జట్టు విజయావకాశాలను దెబ్బకొట్టిందనే అభిప్రాయాలు ఉన్నాయి. అటు రవీంద్ర జడేజా వ్యక్తిగత ఫామ్‌ను కూడా కోల్పోయాడు. స్టార్ ఆల్ రౌండర్ గా పేరుపొందిన జడేజా.. అన్ని విభాగాల్లో చేతులేత్తేశాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు విభాగాల్లో అత్యంత చెత్త ప్రదర్శన నమోదు చేశాడు.
ఇక, లేటెస్ట్ గా సీఎస్కే యాజమాన్యం, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాల మధ్య విబేధాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ధోని స్థానంలో జట్టును నడిపించడంలో విఫలమైన జడ్డూపై సీఎస్కే గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అందుకు తగ్గట్లే సీఎస్కే ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో జడేజాను అన్‌ఫాలో చెయ్యడం పలు అనుమానాలకు తావిస్తుంది. దీనికి తోడూ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో జడేజాను పక్కనబెట్టడం వెనుక సీఎస్కే ఫ్రాంచైజీ హస్తం ఉన్నట్లు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
2012లో తొలిసారి సీఎస్కేలో అడుగుపెట్టిన జడేజా.. మధ్యలో గుజరాత్ లయన్స్(రెండు సీజన్లు సీఎస్కేపై నిషేధం)కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2016లో రూ. 9.5 కోట్లకు జడేజాను సీఎస్కే కొనుగోలు చేసింది. అప్పటినుంచి జడ్డూ సీఎస్కేకు ఆడుతూ వస్తున్నాడు. గతేడాది మెగావేలానికి ముందు సీఎస్కే ధోని, రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు రూ.16 కోట్లకు జడేజాను రిటైన్ చేసుకుంది.
అయితే ధోని తనకు పెద్ద మొత్తం వద్దని.. జడేజాకు ఎక్కువ మొత్తంలో చెల్లిస్తే బాగుంటుందని తనకు తానుగా చెప్పడంతో సీఎస్కే కూడా జడ్డూపై నమ్మకంతో అతనికి ఎక్కువ మొత్తం అందించింది. అయితే తాజా సీజన్లో జడేజా తన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ ఎపిసోడ్ ను వార్నర్ కి జరిగిన ఘటనతో పోలుస్తున్నారు అభిమానులు.
దీంతో.. వార్నర్ మాదిరిగానే.. జడేజాను కూడా జట్టు నుంచి సాగనంపడానికి సీఎస్కే యజామాన్యం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదీ గాక.. అసలు ఈ సీజన్ లో రాణించని జడేజా అంత మొత్తం చెల్లించడం కూడా సీఎస్కే ఫ్రాంచైజీకు ఇష్టం లేదన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి.. జడేజాకు.. CSK ఫ్రాంచైజీకి మధ్య ఉన్న అనుబంధం ఈ సీజన్ తో ఎండ్ కార్డ్ పడినట్టే అని అభిమానులు భావిస్తున్నారు.