ఆఖరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ లో.. చెన్నై విజయం సాధించాలంటే చివరి ఓవర్ లో 17 పరుగులు అవసరం అయ్యాయి. తొలి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే రాగా.. ఆఖరి నాలుగు బంతులను వరుసగా 6, 4, 2, 4 కొట్టిన ధోని చెన్నైకు అద్భుత విజయాన్ని అందించాడు. ఒకరకంగా చెప్పాలంటే ఈ మ్యాచ్ ద్వారా వింటేజ్ ధోనిని అతడి అభిమానులకు పరిచయం చేశాడు.
అయితే, మిస్టర్ కూల్ ధోని.. 3 ఏళ్ల తర్వాత హిస్టరీ రిపీట్ చేశాడు. మూడేళ్ల క్రితం ఐపీఎల్ 2019లో జయదేవ్ ఉనద్కత్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. ఆ సమయంలో ఉనద్కత్ వేసిన చివరి 3 బంతుల్లో ధోని 3 సిక్సర్లు బాదాడు. చివరి ఓవర్లలో ధోనీ బాదిన ఆ మూడు సిక్సర్లే కీలకంగా మారాయ్. ఆ మ్యాచులో చెన్నై కేవలం 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఉనద్కత్‌ను ధోనీ ఉతికి ఆరేసిన చరిత్ర తెలిసినప్పటికీ, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి మహీ మైదానంలో ఉండగానే అతనికి చివరి ఓవర్ ఇచ్చాడు. రోహిత్ చేసిన ఈ తప్పు ముంబై పాలిట శాపంగా మారింది. చెన్నై విజయానికి చివరి 4 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా ధోని తన తడాఖా చూపించి సీఎస్కేకి విజయం ఖాయం చేశాడు.
ఇక, ఈ సీజన్లో ఐపీఎల్లో ముంబైకి ఇది వరుసగా ఏడో ఓటమి. ఈ సీజన్లో ముంబై ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దీంతో పాటు ముంబై పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్ సీజన్లో తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఓడిన తొలి జట్టుగా ముంబై నిలిచింది. అంతకుముందు 2013లో ఢిల్లీ డేర్ డెవిల్స్, 2019లో ఆర్సీబీ తొలి 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి.
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ అట్టడుగున ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 7 మ్యాచ్‌ల్లో 2 గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ముంబై, చెన్నై జట్లు ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లు. ఐపీఎల్ ట్రోఫీని ముంబై 5 సార్లు, చెన్నై 4 సార్లు గెలుచుకున్నాయి. కానీ, ఈ సారి మాత్రం ఈ రెండు జట్లు అట్టడుగున నిలిచాయ్.