ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) చెత్త ఫామ్ తో అందరి చేత విమర్శలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ పరుగుల కోసం నానా కష్టాలు పడ్డాడు. ఐపీఎల్ తొలి ఎడిషన్ 2008లో కేవలం 165 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.. 2009లో 246 పరుగులు చేశాడు.
ఇక అప్పటి నుంచి ప్రతి సీజన్ లోనూ 300లకు పైగానే పరుగులు చేస్తూ వచ్చాడు. ఇక, గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ కు ముందు 2022 సీజన్ లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 13 మ్యాచ్ ల్లో కేవలం 236 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో.. ఈ సారి కూడా చెత్త రికార్డు మూట గట్టుకోవడం ఖాయం అనుకుంటున్న వేళ తిరిగి తన సత్తా ఏంటో చూపాడు.
ఈ సీజన్ లో పేలవ బ్యాటింగ్‌తో సతమతమైన కింగ్.. ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో విరాట్(54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విరాట్ మరోసారి ఛేజింగ్ కింగ్ గా నిలిచాడు.
ఈ సీజన్లో ఇప్పటి వరకు 14 మ్యాచ్‌ల్లో విరాట్ 309 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. దాంతోనే విరాట్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో శిఖర్ ధావన్, సురేశ్ రైనా పేరిట ఉన్నరికార్డులను బ్రేక్ చేశాడు. విరాట్ ఇప్పటి వరకు 13 సార్లు 300కు పైగా పరుగులు చేయగా.. సురేశ్ రైనా, ధావన్ 12 సార్లు ఈ ఘనతను అందుకున్నారు.
ఇక, ఆర్సీబీ తరపున ఐపీఎల్లో ఏడువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 57 పరుగుల వద్ద ఉన్నప్పుడు కోహ్లీ ఈ ఘనత సాధించాడు. 235 ఇన్నింగ్స్‌ల్లో ఏడు వేల పరుగుల మార్క్‌ను అందుకున్న కోహ్లీ.. ఐపీఎల్లో ఒక జట్టు తరపున అత్యధిక పరుగులు సాధించిన తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు.
గుజరాత్‌తో మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన విరాట్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీల భాగస్వామ్యాలు నెలకొల్పిన బ్యాటర్ చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు విరాట్ 23 సార్లు 100 పరుగులకు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 150 ప్లస్ రన్స్ భాగస్వామ్యం 6 సార్లు, 200 పరుగుల పార్టన్ర్షిప్ మూడు సార్లు నమోదు చేశాడు.
ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన బెంగళూరు ప్లే ఆఫ్స్ రేసులో ఇంకా నిలిచే ఉంది. అయితే, ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే మాత్రం ఢిల్లీ కేపిటల్స్ జట్టు తన తర్వాతి మ్యాచ్‌లో ఓడిపోవాల్సి ఉంటుంది. గెలిస్తే కనుక మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది. బెంగళూరు ఇంటి ముఖం పడుతుంది.