ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ప్రయాణం పడుతూ లేస్తోంది. స్ట్రాంగ్ లైనప్ ఉన్నా.. ఆ జట్టు మాత్రం తడబడుతోంది. మరోవైపు.. కరోనా కూడా ఆ జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. స్టార్ ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ కరోనా బారిన పడి కొన్ని మ్యాచులకు దూరమయ్యారు. మరోవైపు.. గాయాలు కూడా ఆ జట్టుకు పీడకలలా మారాయ్.
ఈ సీజన్ లో 12మ్యాచ్‌ల్లో 6విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్.. 12పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలుపొంది ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలని చూస్తోంది. అయితే.. ఇతర జట్లు కూడా పోటీలో ఉండటంతో ఢిల్లీ మెరుగైన రన్‌రేట్ సాధిస్తేనే ప్లేఆఫ్స్ చేరుకోవడానికి వీలు పడుతుంది.
సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు పృథ్వీ షా అందుబాటులోకి రానున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. ఇక పృథ్వీ షా టైఫాయిడ్ బారిన పడ్డాడని గత మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ రిషబ్ పంత్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక పృథ్వీ షా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.